ఎల్నినో ప్రభావంతో వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాలో వానకాలం పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. విత్తనాలు నాటే సమయానికే వర్షాలు కురువడంతో విత్తనాలను నాటిన రైతులు తదనంతరం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. విత్తనాలను నాటిన నాటి నుంచి పంటలకు సరిపడా ఒక్క భారీ వర్షం కురువక పంటలు ఎండిపోవడంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అధికారులు రైతులను ప్రోత్సహించారు. ప్రధానంగా జిల్లాలో అధిక మొత్తంలో సాగు చేసే పత్తి, మొక్కజొన్న పంటల ఎదుగుదల లేకపోవడంతో ఈసారి పంటలు ఏమవుతాయోనని అమోమయంలో పడిపోయారు.
– వికారాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)
జిల్లావ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో ఆయా పంటల సాగు విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే తగ్గింది. గతేడాది వానకాలం సీజన్లో పత్తి 2.87 లక్షల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేయగా, ఈ ఏడాది 2.08 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట సాగయ్యింది. వరి పంటకు సంబంధించి గతేడాది 1.41 లక్షల ఎకరాల్లో సాగుకాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 90 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. వరి, పత్తి పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేసేలా క్షేత్రస్థాయిలో జిల్లా వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని 510 గ్రామ పంచాయతీల్లో ఎల్నినో ఎఫెక్ట్ ప్రభావం చూపినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. అత్యధికంగా కులకచర్ల, బంట్వారం, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లోని 42 గ్రామాల్లో అత్యధికంగా ఎల్నినో ప్రభావం ఉన్నట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ 42 గ్రామ పంచాయతీల్లో వేసిన పంటలను దున్ని ప్రత్యామ్నాయ పంటలను వేశారు.
తక్కువ వర్షపాతం నమోదు
జిల్లాలో లోటు వర్షపాతం నమోదు అయ్యింది. వానకాలం ప్రారంభ సమయంలో ఒకట్రెండు భారీ వర్షాలు మినహా చెప్పుకోదగిన వానలు కురువకపోవడం గమనార్హం. జూన్ నెలలో కేవలం 8 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. జూన్ మాసంలో జిల్లాలోని పది మండలాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ మొదటి వారం, రెండో వారంలో అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలను నాటారు. తదనంతరం జూన్ చివరి వారం నుంచి వాన జాడ లేకుండా పోయింది. జూలైలోనూ వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని 12 మండలాల్లో అధిక లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులో కురిసిన వర్షాలతో అధిక లోటు వర్షపాతం నుంచి లోటు వర్షపాత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని దౌల్తాబాద్, బషీరాబాద్, పెద్దేముల్, బంట్వారం, దోమ, కులకచర్ల, పరిగి, మర్పల్లి మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది.
ఎదుగుదలలేని పంటలు
ఈ వానకాలం సీజన్లో ఆయా పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5.90 లక్షల ఎకరాలుకాగా, ఇప్పటివరకు జిల్లాలో 5.02 లక్షల ఎకరాల్లో ఆయా పంటలను జిల్లా రైతాంగం సాగు చేసింది. అత్యధికంగా 2.43 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా, 1.07 లక్షల ఎకరాల్లో కందులు, 90 వేల ఎకరాల్లో వరి, 42 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేశారు. జిల్లాలో అత్యధికంగా సాగైన పత్తి పంట పరిస్థితి అయోమయం నెలకొన్నది. పత్తి విత్తనాలను నాటిన దాదాపు నెలరోజులపాటు మొలకెత్తడం తప్ప ఎదుగుదల మాత్రం లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వాన దేవుడికి మొక్కులు మొక్కుతూ, మరోవైపు మొలకెత్తిన పంటను బతికించుకునేందుకు బిందెలతో నీటిని అందిస్తూ కష్టాలు పడినప్పటికీ పంటల ఎదుగుదల మాత్రం ఆందోళన కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
పంటల పరిస్థితులను చూసిన రైతులు విత్తనాలకు, ఎరువులకు తెచ్చిన అప్పు మీద పడేటట్టుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లా రైతాంగం ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. పత్తి, వరి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన కందులు, మినుములు, పెసలు తదితర పంటలను సాగు చేసేలా చర్యలు చేపట్టారు. 55,100 ఎకరాల్లో కందులు, 9500 ఎకరాల్లో పెసలు, 1500 ఎకరాల్లో మినుములు, 500 ఎకరాల్లో అలసందలు, 5600 ఎకరాల్లో మొక్కజొన్న, 25 ఎకరాల్లో జొన్న, 5250 ఎకరాల్లో కూరగాయల పంటలు, మరో 20 వేల ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేసేలా జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది.