హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 16 : నిరుద్యోగుల అవసరాన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. వరంగల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్య, వైద్య, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డం పెట్టుకొని రూ. లక్షల వసూలుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తోడవ్వడంతో వారికి అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఏజెన్సీలకు సంబంధించి అధికారిక ప్రొసీడింగ్స్ వెలువడకముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామలో తెర వెనుక దందా మొదలైనట్లు నిరుద్యోగులు ఆరో పిస్తున్నారు.
ఇప్పటికే ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకాల్లో ఏజెన్సీల బాగోతం బయటపడి నా అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక పాఠశాలల్లో కంప్యూటర్ బోధకుల నియామకాలను జిల్లా విద్యాశాఖకు సంబంధం లేకుండా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పజెప్పేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇన్స్ట్రక్టర్లు, ఆ యాల్లో వారి చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం.
పలు కీలక శాఖల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరో పది రోజుల్లో ఎంపిక చేసిన ఏజెన్సీలకు ప్రొసీడింగ్స్ అందనున్నాయి. ఈ క్రమంలో నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా..? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అటెండర్, స్వీపర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జేఎన్ఎం, ఏఎన్ఎం, సూపర్వైజర్స్థాయి పోస్టులకు రూ. లక్ష నుంచి రూ. 2, 3 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. నోటిఫికేషన్ లేకుండా నియామకాలు చేయడం లేదని, నిరుద్యోగులు నమ్మి మోసపోవద్దని ఉన్నతాధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు.
కొన్ని ఏజెన్సీల ప్రతినిధులు అప్పుడే నిరుద్యోగులతో బేరసారాలు మొదలుపెట్టారు. కొంత మంది నమ్మకస్తులైన వ్యక్తులను ముందుపెట్టి ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు ను ఫిక్స్ చేసినట్లు, ముందుగా కొంత.. నియామక ప త్రం అందిన తర్వాత మరికొంత అనే పద్ధతిలో వసూళ్లు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రభుత్వం పారదర్శకమైన పద్ధతిలో నియామకాలు జరిగేలా చూడాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్రంలో భారీస్థాయిలో ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి రాగా, ఉమ్మడి జిల్లాలో బోగస్ ఉద్యోగుల ను ఉన్నట్లుగా చూపించి, నెలనెలా జీతాలు తీసుకున్న ట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రభుత్వం చేపట్టిన ఆధార్ లింకేజీ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. ఉద్యోగుల పేర్లతో జీతాలు డ్రా చేస్తు న్నా, వాస్తవానికి వారు ఉద్యోగంలో లేరని గుర్తించారు. బోగస్ ఉద్యోగుల పేర్లతో జీతాలు పొందిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించినప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని నిరుద్యోగులు మండిపడ్డారు.