న్యూఢిల్లీ: ఆల్కాహాల్ పరీక్షలో ఎయిర్ ఇండియా కో-పైలట్(Air India Pilot) విఫలం అయ్యాడు. దీంతో అతన్ని విధుల నుంచి తప్పించారు. జూరిచ్ ఎయిర్‌పోర్టులో సెప్టెంబర్ 6వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే విమానం ఢిల్లీకి టేకాఫ్ తీసుకోవడానికి ముందు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. జూరిచ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానానికి చెందిన కో-పైలట్ తాగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రిలిమినరీ పరీక్షలో అతను ఫెయిల్ అయినట్లు చెప్పారు. జూరిచ్‌లో నిర్వహించిన రెండో పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఓ ప్యాసింజెర్ రూపంలో అతన్ని ఇండియాకు వెనక్కి పంపించారు. ప్రస్తుతం అతను సస్పెన్షన్‌లో ఉన్నాడు.
తుది వైద్య పరీక్ష రిపోర్టు కోసం అధికారులు వేచి చూస్తున్నారు. కో-పైలట్ మద్యం మత్తులో ఉన్న కారణంగా… ఏఐ 151 విమానాన్ని షెడ్యూల్ ప్రకారం నడపలేకపోయినట్లు అధికారులు చెప్పారు. ఆ విమానాన్ని మరుసటి రోజు నడిపారు. క్రమశిక్షణ, బాధ్యతను దృష్టిలో పెట్టుకుని ఆ పైలట్ పై చర్యలు తీసుకోనున్నట్లు ఎయిర్ ఇండియా చెప్పింది. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలోని పైలట్ కూడా డ్రగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు. అతను మారిజూనా తీసుకున్నట్లు నిరార్ధణ అయిన విషయం తెలిసిందే.