– నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 25 : గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇళ్లతో పాటు గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ బానోత్ సరోజ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామంలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడు మహిమూద్ను పుష్పగుచ్ఛం, శాలువతో సత్కరించారు. ఫ్రైడే.. డ్రైడే కార్యక్రమాన్ని ఎస్సీ కాలనీలో నిర్వహించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అవగాహన కల్పించారు. ఇళ్లలో, మురుగునీటి కాలువలు, డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి చేకూరి రవి, వార్డు సభ్యులు నర్సయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.