(గత వారం తరువాయి)
ఈ వాచకాభరణుడు, కుర్క్యాల శాసనంలో తన బిరుదుగా పేర్కొన్న జినవల్లభుడే. పై పద్యంలో బిరుదులా కాక, బిరుదే వ్యవహారనామంగా నాడు ప్రసిద్ధి చెందినదిగా భావించవచ్చు. పేరు పేర్కొనలేదు. మిగతావి రెండు విశేషణాలు. కర్ణునితో సమానమైన దానశీలత కలిగినవాడని మల్లియ రేచన చెప్పినాడు. పంప జైనుడే ఐన ద్విజావసద గ్రామంలోని ద్విజుల వరప్రసాదము (అమ్మమ్మ ఇంటి వల్ల) కలిగినవాడని చెప్పాడు. ఈ ముగ్గురూ జైనులే. కాని, బ్రాహ్మణానురక్తులే.
జినవల్లభుని కుర్క్యాల శాసనంలో కర్ణసమానదాత అన్నది సత్యమే అని నిర్ధారించేలా జినవిగ్రహ నిర్మాణం, గుణార్ణవమనే పంపని పేరిట చెరువును తవ్వించడం, మదనవిలాసమనే ఉద్యానవనాన్ని, త్రిభువనతిలకమనే జినమందిరాన్ని నిర్మించడం పేర్కోబడ్డది. అబ్బెనబ్బె, జినవల్లభ, పంపకవి సోదరుల తల్లి అని ఈ శాసనం చెప్తుంది. అబ్బె అంటే అవ్వ. గౌరవ (మాతృక) వాచకం. అచ్చబ్బె, దేవకబ్బె, దీపకబ్బె వంటి పేర్లు నాడు స్త్రీలకుండేవని ఆహవమల్లుని చొప్పదండి శాసనం ధృవీకరిస్తున్నది.
ఈ మూడు తెలుగు, మూడు కన్నడ కందపద్యాలు ఈ శాసనంలో జినవల్లభుడు రాశాడు. నాడు కరీంనగర్ ప్రాంత కవులకు అత్యంతాభిమానోపాదేయ ఛందం గా ఉండేది. హాలుని గాథాసప్తశతి సంకలనంలో ప్రాకృత ఛందాలన్నీ గాథాచ్ఛందాలే. గాథ 10 భేదాల్లో కందం ఒకటి. ఇది ప్రాకృతంలో ఖంద అ. అక్కడి నుంచే తెలుగులోకి వచ్చింది. జగణ నిషేధం ప్రాకృత ఛందోలక్షణం. తెలుగులో ఈ నియమం లేదు. కందంలో ఉన్నది. పంపని కాలంలో అతనికి ధారాదత్తం అయిన ఈ ధర్మపురి నుంచే ఓ అజ్ఞాత కవి క్రీస్తు శకం 918 (శ.సం.840)లో శ్రీధర్మపురి క్షేత్ర మహాత్మ్యమనే మూడున్నరవేల శ్లోకాలతో సంస్కృత భాషలో కావ్యం రాశాడు. దాంట్లో కూడా కంద పద్యాలున్నాయి. దీంట్లో (సంస్కృతంలో లేని, అక్కరలేని య కార) ద్వితీయాక్షర ప్రాస కూడా ఉన్నది.
కవిజనాశ్రయ ఛందస్సు మల్లియ రేచన అన్ని పద్యాలు మొత్తం గ్రంథం కందచ్ఛందంలోనే రాశాడు. ఆదిపురాణంలో, విక్రమార్జున విజయంలో 730 కందపద్యాలు పంపమహాకవి వాడినాడు. ఈ ప్రాంతం కందాల నిలయం. తండ్రి వేంగి నుంచి సబ్బి మండలానికి వలస రాగా, ఇక్కడి సింగన కూతురిని పెండ్లాడిన కారణంగా భీమన ఈ ప్రాంతం వాడైనాడు. ఆయన ఇద్దరు కొడుకులు పంప, జినవల్లభుడు ఈ సబ్బి (కరీంనగర) ప్రాంతీయులే అయినారు. కన్నడ విక్రమార్జున విజయంలో బనవాసి వర్ణన కేవలం అమ్మమ్మల పూర్వీకుల ప్రాంతాలపై ప్రేమతో పేర్కొన్నదే.
జయనంది శిష్యుడై సన్యసించిన పంపడు సన్యాసానంతరం శుభనంది అయినాడు. అతడు అంతిమ దినాలు జైనుల పరమ పవిత్రక్షేత్రమైన బోధన్‌లో గడుపుతూ దివంగతుడైనాడు. పంపడు రాసిన ఆదిపురాణం రిషభదత్తుని చరిత్ర. ఈయన జైనమత ప్రతిష్ఠాపకుడు. తొలి జైనమత ప్రవక్త. ఈతని కుమారుడు బాహుబలి రెండవ ప్రవక్త. వీరిద్దరూ బోధన్ ప్రభువులు. క్రీ.పూ. 1000 ప్రాంతం వారు.
24వ తీర్థంకరుడైన మహావీరునికి ఐదు శతాబ్దులు పూర్వమువారు. మహావీరుడు బుద్ధునికి ముందువాడు. అదే శతాబ్ది. వీరు 450 ఏండ్ల ముందువారు. బోధన్ (పోదన, పౌదన్య, బహుధాన్య, పోతన అని వివిధ నామాలున్న) నగరం, తెలంగాణలో 3 వేల ఏండ్ల క్రిందటిది. ఇది అశ్మక రాజ్య రాజధాని నగరం. దీనిని మహిషాసురుడేలినాడు. అతనిపేర ఈ నగరంలో రాకాసి వీధి అని ఒక వీధి (ప్రాంతం) ఉన్నది. భైంసా (మహిషా), భైంసాసురపూర్ ఇతని పేరిటగల ఈ ప్రాంతపు నగరాలు ఇప్పటికీ ఇదే పేర్లతో ఉన్నాయి. రాష్ట్ర కూటరాజుల కాలంలో కలబురిగి (గుల్బర్గా) ప్రాంతంలోని జినసేనుడు క్రీ.శ.783లో రాసిన పూర్వపురాణం ఆధారంగా పంపడు జినేంద్ర పురాణం అనే తెలుగు కావ్యం రాశాడు. దానిలోని ఒక సీసపద్యం మాత్రం దొరికింది. పంపని జినేంద్ర పురాణం తెలుగుకావ్యం దొరికితే కన్నడాంధ్రులకు ఈతడే తొలికవి అయి ఉండేవాడు. ఇమ్మడి అరికేసరి (ఇమ్మడి అంటే రెండవవాడు) ఆస్థానియైన పంపడు వేములవాడలోనే ఉన్న అరికేసరికి తండ్రి నరసింహుడు ఏలిన రాజధాని నగర బోధన్‌కు తరచూ ప్రయాణాలు సాగించేవాడు. పుణ్యక్షేత్రమైన బోధన్‌లో పంపడు చరమ జీవితం గడిపి అక్కడనే మృతుడై సమాధియైనాడు. సమాధిపై లభించిన ఈ శాసనం జినవల్లభుడు (తమ్ముడు) వేయించి ఉండవచ్చు. ఈ శాసనం కాశీనాథ్ అనే పూజారి ఇంటి పునాదిరాయిపై కందకుర్తి యాదవరావు, నేను చూశాం.
పాఠం: దీపేన్ద్ర సిద్ధా, న్తమునీశ్వరస్య శిష్యా భవ, శ్రీ శ్చుభవన్ది ముని, మాలారాధ్య, రత్నత్రయ మం, త్య కాల స్సమా, ధిన స్సుత, లోకమాయా
తరువాతి శాసనభాగం ముక్కలై దొరకలేదు. ఈ శాసనం రాయి తనకెక్కడ లభించిందో పూజారి చెప్పలేకపోయాడు. చెప్పి ఉంటే మనకు సమాధి స్థలం తెలిసి ఉండేది. ఈ శాసనం గూర్చి సీతారామ జాగీర్దార్ ఎపిగ్రాఫికా ఆంధ్రికా వాల్యూం -02లో కొంత వివరణ ఇచ్చారు. దీనిలో రత్నత్రయం పేర్కోబడ్డారు. రత్నత్రయమంటే పంప, రన్నె, పొన్న కవులు. పొన్న రాష్ట్రకూట మూడవ కృష్ణుని (క్రీ.శ.939-968) ఆస్థాని. ఇతని ‘సర్వదేశ కవి అన్న బిరుదు ఉన్నది. భువనైక రామాభ్యుదయం ఆయనకృతి. ఇతని కుమారుడు రన్నకవి. ఈ ముగ్గురిని పంప సమాధి శాసనం రత్నత్రయం అన్నది. దీన్ని బట్టి ఈ శాసనం క్రీ.శ.968 అవతలది అని చెప్పవచ్చు. అందువల్ల పంపమహాకవి క్రీ.శ.905లో పుట్టి, 970 ప్రాంతంలో సమాధి అయినట్టు భావించవచ్చు.
పంపని మరొక శాసన రచన కరీంనగర్ జిల్లాలో కనబడుతున్నది. వేములవాడ ప్రభువు అరికేసరి (ఇమ్మడి) వేయించిన శ.869 పరాభవ కార్తీక బ.11 సోమవారం నాటి శాసనం. ఇది క్రీ.శ. 946. దీని రచయిత పంపడే (నేటి పరాభవ క్రీ.శ. 2026కు 18 ఆ వృత్తుల కింది పరాభవ 2026-946=1080/60 సంవత్సరం. ఒక వృత్తం=18)
ఈ శాసనం అరిపణపల్లి గ్రామదాన శాసనం. ఈ శాసనంలో పంపడు తన విక్రమార్జున విజయంలోని ఐదు పద్యాలు (1వ ఆశ్వాసం 15, 31, 41, 42, 50 సంఖ్యగలవి). ఈ శాసనంలో రాసుకొన్నాడు. తొలి 15వ పద్యంలో ఈ శాసనం ప్రారంభం అయింది. స్వసి*్తశ్రీ మచ్చళు క్యవంస (వ్యో)) మా మృత కిరణ నెనిప కాన్తి యనొళ కొణ్డీ మహియొ ళాత్మ వంశ సిఖామణి (జ) సమెసెయె జుద్దమల్ల నెగళ్దం (1) * ఆత్మభవనాధరాధి పనాత్మజన నహూష పృథు భగీరతనళ రామాత్మజ (రనిళి) సినెగళ్ద మహాత్మ నరసి (జ్ఞ) నఱివి నొళ్ పరమాత్మం (2)* 1, 2 పద్యాలు చూపినాను. ఇవి రెండు కంద పద్యాలే.
2వ పద్యంలో శాసనస్థ ధరాధిపకు బదులు విక్రమార్జున విజయంలో నరాధిప అని పాఠాంతరం ఉన్నది. శాసనంలో వరుసగా రాయబడ్డ పంపభారత పద్యాలు 15, 31, 41, 42 నాలుగు కంద పద్యాలే ఐదవది మాత్రం ఉత్పలమాల. దీనిలో గుణార్ణవ బిరుదు ఉన్నది. పంపడు ఈ పేరుతో చెరువు నిర్మించాడు. అలాగే ఈ శాసనంలో అరికేసరికి త్రిభువన మల్ల అనే బిరుదు ఉన్నది. పంపడు ఈ పేర్లతో తటాక, ఆలయాలు నిర్మించినట్టు జినవల్లభుని కుర్క్యాల శాసనం చెప్తున్నది. పంపడిని తొలి ఆలయ నిర్మాణ కవిగా గుర్తిద్దాం.
పంప మహాకవికి పద్మకవి అని కూడా పేరు. బోధన్ పద్మపురం కనుక ఆ ఊరికవిగా పేరు. ఈయన రాసిన జినేంద్ర పురాణంలో (ఇది క్రీ.శ.940 ప్రాంత రచన) ఒక తెలుగు పద్యం దొరికింది.
సీ. హరి నిలయంబును హరి నిలయంబును, విషధరాఢ్యంబును విషధరాఢ్య మప్సరోమయమును నప్సరోమయమును వనవిలాసమును పావన విలాస మున్నత కరిశృంగ మున్నత కరిశృంగ మురు కలన కులంబు నురు కలన కులంబు వంశుకాంత ద్యోతి నంశు కాంత మీదుకాంత స్రవమిందు కాంత మొనర నవశత సాహస్ర యోజనోన్న తమును పదివేల యోజనలమరు వలము గలిగి కనకాద్రికి న్నూట గలికినరి ప్రథితమై యొప్పు మందర పర్వతంబు.
క్రీ.1560 ప్రాంతంలో ఓ అజ్ఞాత కవి సంకలించిన 32 మంది కవుల కావ్యస్థ పద్య సేకరణలో ఈ పద్యం దొరికింది. ఈ సంకలన కావ్యం పేరు ప్రబంధ రత్నావళి. ఒకే పద్యం దొరికింది. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు దీనిలో శ్లేషపై- ఇది ప్రాచీనత గల కావ్యం కాదేమోనని శంకించినా, శ్లేషమయ కవిత్వం పంపకవి నాటికి కొత్తకాదు. సంస్కృత కన్నడ భాషల్లో శ్లేష కవిత్రం ప్రహతమే. దీనితో పంప మహాకవే తెలుగునాట తొలి కవి అవుతాడు.