జనగామ, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : జనగామ పట్టణ అభివృద్ధికి పైసా ఖర్చు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లడిగే హక్కులేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 3, 4 వార్డుల్లోని పలు కాలనీల్లో మార్నింగ్ వాక్ నిర్వహించి స్థానిక ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిషారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి బీఆర్ఎస్ అభ్యర్థులు జూకంటి శ్రీశైలం, ఉలిగిల్ల స్వరూపను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం 16, 30, 11, 12, 25, 28, 29, 23వ వార్డుల్లో ఆకాంక్ష, జేరిపోతుల కుమార్, ఎనగందుల అనసూయ, గుర్రం భూలక్ష్మి, ఉల్లెంగుల నర్సింగ్, హఫీజ్ ఫాతిమా, ముస్త్యాల మౌనిక, మేకల రాంప్రసాద్ గెలుపు కోసం రోడ్‌షో, కార్నర్ సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలిచ్చి వాటిని గాలికొదిలేసి రాష్ర్టాన్ని దోచుకుంటున్న తీరును విజ్ఞులైన ప్రజలు గమనించి.. గతంలో 10 ఏండ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని, జనగామ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ఎలా ఉండేది? రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? నిర్ణయించాల్సింది మీరేనని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు ఏం చేశారని చెప్పి వారిని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక నోట్ల కట్టలతో ఓటర్ల దగ్గరకు వస్తున్నారని, ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తాలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.
ఇప్పటి పట్టణ అభివృద్ధి అంతా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందే.. వచ్చేది మన ప్రభుత్వమే.. జనగామ జిల్లా కేంద్రం రూపురేఖలు మారేలా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, తనను నమ్మి బీఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ప్రముఖ తెలంగాణ కవి, గాయకుడు మిట్టపెల్లి సురేందర్ పాల్గొని కార్నర్ మీటింగ్ సభల్లో తన పాటలతో ఉర్రూతలూగించారు.