జనగామ, మార్చి 29(నమస్తే తెలంగాణ) : దేవాదుల పంపులు సకాలంలో ఆన్‌చేసి నీళ్లివ్వకుండా ప్రభుత్వం గ్రామాల మధ్య కొట్లా ట.. రైతుల మధ్య చిచ్చుపెట్టిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. లెఫ్ట్ కెనాల్ ఇప్పితే.. రైట్ కెనాల్ వాళ్లు కొట్లా డుతున్నారని, రిజర్వాయర్ నుంచి నీళ్లు తరలిస్తే ఆయకట్టు రైతులు గొడవ పడుతున్నార ని, కాంగ్రెస్ నిర్వాకం వల్ల ఊళ్లు, మండలాల మధ్య కొట్లాట జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గంలోని 91 మంది లబ్ధిదారులకు రూ.26.48 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా, శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ నీళ్లు మంచిగ ఉంటే ఈ సమస్య రాదని.. నీళ్లివ్వకుండా ప్రజలు, రైతుల మధ్య కొట్లాట పెట్టిందన్నారు. బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, చీటకోడూరు రిజర్వాయర్ల ద్వారా గతంలో వాటి పరిధిలోని చెరువులు, కుంటలన్నీ నిండాయన్నారు. కేసీఆర్ కట్టిన సమ్మక్క బరాజ్‌లో నడి ఎండాకాలంలోనూ నీళ్లున్నాయని, ధర్మసాగర్, గండిరామారం, బొమ్మకూరు నుంచి ఎత్తిపోసే మోటర్లు ఉన్నాయని.. అన్ని చెరువులకు కావాల్సినన్ని నీళ్లున్నా.. వాటిని తీసుకొచ్చే తెలివి కాంగ్రెస్ పాలకులకు లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 34 రోజులు మెయింటనెన్స్ సంస్థకు రూ. 6 కోట్లు విడుదల చేయని ఫలితంగా రూ.600 కోట్ల మేర రైతులకు నష్టం జరిగిందని ధ్వజమెత్తారు.
ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వంతో కొట్లాడితే ఆలస్యంగా పంపులు ఆన్ చేశారని, అవి కూడా మూడు రోజులకే ఆగిపోయాయని మండిపడ్డారు. రెండు నెల ల్లో 40 రోజులు పంపులు అసలే పనిచేయలేదని.. ఇంత అన్యాయంగా గతంలో ఏ ప్రభుత్వమూ వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా అన్నారు ఏమైంది? రుణమాఫీ ఇంకా పూర్తికాలేదని.. కేసీఆర్ హయాంలో 11సార్లు పెట్టుబడి సాయం పడలేదా? రైతుబంధు, రైతుబీమా అందరికీ కడుపునిండా ఇవ్వలేదా? గింజ కూడా మిగలకుండా వడ్లు కొనలేదా అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో ఇదే సవాల్ చేశానని, జనగామ నియోజవకర్గంలోని 128 గ్రామాల్లో ఎక్కడై నా 100 శాతం రుణమాఫీ అయిందని చెబితే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని చా లెంజ్ చేశానని చెప్పారు. పచ్చి అబద్ధాలు.. మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఒక్క బస్సు ఫ్రీ మినహా ఏ ఒక్కటీ నెరవేర్చలేదని లెక్కలతో సహా అసెంబ్లీలో కడిగిపారేశామన్నారు. అసెంబ్లీలో జీరో అవర్.. క్వశ్చన్ అవర్‌లో మాట్లాడేందుకు ఎప్పుడు అవకాశం వచ్చినా జనగామ ప్రాంత సమస్యలను ప్రస్తావించి సాధ్యమైనంత వరకు ప్రజలకు మేలు చేసే పనులను ప్రభుత్వం దృష్టికి తెచ్చానని అన్నారు. గానుగుపహాడ్ బ్రిడ్జి, చీటకోడూరు బ్రిడ్జి, సీటీ స్కానింగ్, చేర్యాలకు రెవెన్యూ డివిజన్ అంశాలను ప్రస్తావించానని, మూడు సార్లు చెప్పగా, చెప్పగా జనగామ దవాఖానకు సీటీస్కాన్ పంపారని ఎమ్మెల్యే పల్లా గుర్తుచేశారు.
కొమురవెల్లి, ఐనవోలు, కొత్తకొండ, సమ్మక్క సారలమ్మ జాతరకు పోయినట్టు ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊళ్లకు ఊళ్లు కదలిరావాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. 15 నెలల కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టేందుకు తరలివచ్చి కేసీఆర్‌ను మాటలు విని స్ఫూర్తి పొంది మళ్లీ పోరాటానికి సిద్ధం కావాలన్నారు. చెరువులు నిండాలన్నా.. కష్టాలు పోవాలన్నా ఉద్యమస్ఫూర్తితో కదంతొక్కాలన్నారు. సభకు వెళ్లేందుకు గ్రామాల్లో చర్చించుకొని ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో రావాలని పల్లా కోరారు. మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు పోకల జమున, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ ఎంపీపీ మేకల కళింగరాజు, మాజీ సర్పంచుల ఫో రం అధ్యక్షురాలు శారద, బీఆర్ఎస్ నాయకులు బండ యాదగిరిరెడ్డి, ఇర్రి రమణారెడ్డి, వీ శ్రీనివాస్‌రెడ్డి, భూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, రాజు, యాదగిరిగౌడ్, రేఖ, ఎడ్ల రాజు పాల్గొన్నారు.