శక్కర్‌నగర్/ఆర్మూర్‌టౌన్, మార్చి 3: హోలీ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. హోలీ ఆడిన అనంతరం మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి చెందగా, ఆర్మూర్‌లో మరొకరు చెరువులో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఆచన్‌పల్లిలో మంగళవారం యువకులు హోలీ ఆడారు. అనంతరం మంజీరాలో స్నానానికి వెళ్లారు. స్నేహితులు చూస్తుండగానే సాయికుమార్ (20), రోనుచౌదరి(19) ఊబిలో కూరుకుపోయి మృతి చెందారు. సమాచారమందుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. రోనుచౌదరి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతుండగా, సాయికుమార్ విదేశాలకు వెళ్లి ఇటీవలే వచ్చాడు. ఆర్మూర్‌కు చెందిన బొగడమీది హర్షిత్ పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం స్నేహితులతో కలిసి హోలీ ఆడి అనంతరం గుండ్లచెరువులో స్నానానికి వెళ్లగా చెరువులో పడి మృతిచెందాడు.