జనగామ, మే 15 (నమస్తే తెలంగాణ) : జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్యలకు పరిష్కారం దొరికింది. హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ భవనంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి అనసూర్య(సీతక్క), కొం డా సురేఖ నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే పల్లా జనగామ నియోజకవర్గంలో రెవెన్యూ, గృహ నిర్మా ణ సమస్యలు, పురోగతి, అవసరాలపై వివిధ అం శాలను లేవనెత్తారు.
లబ్ధిదారులు, ప్రజలు ఎదురొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లా రు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే పేదలు మట్టి, ఇసుక తరలించే సమయంలో అధికారులు కేసులు నమోదు చేయడం, చలాన్లు విధిస్తున్నారని సమావేశంలో గట్టిగా ప్రస్తావించా రు. పేదల ఇండ్ల నిర్మాణానికి అడ్డంకులు సృష్టించడం సరికాదని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా గోదావరి, కృష్ణా నదుల నుంచి ఇసుక తెచ్చుకుని స్థానికంగా ట్రాక్టర్ల ద్వారా పంచుకొని ఇండ్లు నిర్మించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవడం అన్యాయమని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి వెంటనే స్పందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇండ్ల నిర్మాణానికి మట్టి, ఇతర సామగ్రి తరలించే లబ్ధిదారులపై కేసులు నమోదు చేయద్దని జనగామ కలెక్టర్‌కు సందీప్ కుమార్ ఝాకు ఫోన్లో ఆదేశాలు జారీచేశారు.