సాగు నీళ్ల కోసం పొలాలు నోళ్లు తెరుస్తున్నాయి. తడులు అందక చేతికొచ్చే దశలో వరి పంటలు ఎండుతున్నాయి. ఆదుకుంటాయనుకున్న కాల్వల్లో నీళ్లు రాక.. వాగులు, చెరువులు, బావుల్లో జలాలు లేక.. నెర్రెలుబారుతున్న పంటలను చూసి అన్నదాతలు భోరుమంటున్నారు.
వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క మడైనా తడపాలని రాత్రనక, పగలనక రైతులు పొలాల చుట్టూ తిరుగుతూ అరిగోస పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారుల పట్టింపులేనితనంపై మండిపడుతున్నారు.
నర్సింహులపేట, ఏప్రిల్ 16: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట గ్రామ శివారులో పేకాల చెరువు కింద యాసంగిలో సుమారు 70 ఎకరాల్లో వరిసాగు చేశారు. కొన్నేళ్లుగా ఎస్సారెస్పీ ఉప కాలు వ 85 నుంచి ఏడాదంతా నీళ్లు రావడంతో చెరువు నిండుకుండలా ఉండేది. యాసంగి పంటలకు సమృద్ధిగా నీరందడంతో బురదలోనే హార్వెస్టర్‌తో కోతలు జరిగేవి. అయితే, గత ఏడాది ప్రధాన కాల్వకు నీళ్లు వచ్చినప్పటికీ ఇరిగేషన్ అధికారులు ఉప కాల్వకు అడ్డుకట్ట వేయడంతో పేకాల చెరువులోకి చుక్కనీరు రావడం లేదు. ప్రస్తుతం చెరువులో గుంతలో కొన్ని నీళ్లుండగా, రైతులు మోటర్ల ద్వారా తూములో పోయిస్తూ వాటాల వారీగా పొలాలకు పారిస్తున్నారు.
పది నుంచి పదిహేను రోజులకు ఒక తడి పారుతుండడంతో పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే, అధికారులకు చెప్పినా ఫలితం లేదని వాపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు చెరువు దగ్గరకు వెళ్తున్నామని ఆవేదన చెందుతున్నారు. పొట్టదశలో ఎండిపోతున్న పొలాలను చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎకరాకు రూ. 25,000 పెట్టుబడి పెడితే అవి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. రాత్రి కరెంట్‌కు మోటర్ పెట్టేందుకు వెళ్తే క్రిమికీటకాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ స్పందించి చెరువులోకి నీళ్లు విడుదల చేసేలా చూడాలని, లేనిపక్షంలో సుమారు రూ. కోటి వరకు నష్టపోతామని రైతులు చెబుతున్నారు.
ఏటా వచ్చినట్లే ఎస్సారెస్పీ కాల్వ నీళ్లు వస్తాయనే ఆశతో నేను తొమ్మిదెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఈసారి చెరువులోకి చుక్కనీరు రాకుండా అడ్డుకున్న అధికారులే కాల్వ నీళ్లు వచ్చే అవకాశం లేదని చెబుతున్నరు. ఇక్కడి నుంచి నీళ్లు డోర్నకల్ మండలానికి పోతున్నయి. పొలం అంతా పొట్టదశకు వచ్చింది. ఇప్పుడే నీళ్లు ఎక్కువగా అవసరం. ఎండలు పెరుగుతున్నయి. చెరువు గుంతలో ఉన్న నీటికి నాలుగు మోటర్లు పెట్టి తూముల ద్వారా పారించుకుంటున్నం. ఇంత కష్టపడినా పొలాలు పారడం లేదు. అధికారులు, ఎమ్మెల్యే మా బాధను ఆర్థం చేసుకొని సాగునీళ్లు విడుదల చేయాలి. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యం.
– ఇస్సంపల్లి వెంకన్న, రైతు, బొజ్జన్నపేట