వరంగల్, జనవరి 10(నమస్తేతెలంగాణ) : రైతుబంధు పథకం ద్వారా యాసంగి పంట పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఎకరానికి రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది. మంగళవారం వరకు 1,32,352 మంది రైతులకు రూ.98,81,37,738 పెట్టుబడి సాయం అందింది. వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏటా రెండు విడుతల్లో ఎకరానికి రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తున్నది. ఈ ఏడాది వానాకాలం తొలివిడుత ఎకరానికి రూ.5 వేల చొప్పున పంపిణీ చేసింది. రెండోవిడుతలో గత డిసెంబర్ 28 నుంచి ఆర్థికసాయం పంపిణీ చేయడం ప్రారంభించింది.
మొదట వ్యవసాయ భూమి ఎకరంలోపు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం ప్రారంభించిన ప్రభుత్వం ఆ తర్వాత వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు ఎకరాల్లోపు భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థికసాయం జమ చేసింది. ప్రస్తుత యాసంగి జిల్లాలో 1,44,390 మంది రైతులకు ఈ పథకం ద్వారా రూ.132,68,63,167 ఆర్థికసాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం జిల్లాలో 1,721 మంది ఖాతాల్లో రూ.3,56,64,222 జమ చేసింది. దీంతో ఈ పథకం ద్వారా ఆర్థికసాయం పొందిన రైతుల సంఖ్య 1,32,352కి చేరింది. వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.98,81,37,738 జమ చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాలోని 1,43,683 మంది రైతుల కోసం రూ.129,79,70,887 ట్రెజరీకి పంపింది. ట్రెజరీ నుంచి నేరుగా ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నది. రెండో విడుత పంట పెట్టుబడి సాయం అందుకున్న రైతులు సంతోషం వెలిబుచ్చుతున్నారు. యాసంగి పంట సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని సంబుర పడుతున్నారు.