నయీంనగర్, మే 15 : లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్‌పై పోలీసులు, వైద్యాధికారులు సోమవారం దాడులు చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ గోపాలపురంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ టెక్నీషియన్ రూ.రెండు కోట్లతో ఇల్లు కొనుగోలు చేశాడు. సంవత్సరం నుంచి అందులో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానతో పర్సంటేజీ మాట్లాడుకొని లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు స్కానింగ్ సెంటర్‌పై దాడులు చేయడంతో అక్కడున్న వారందరూ పారిపోయినట్లు సమాచారం. ఈ దందాలో అసలు సూత్రధారులెవరో తేల్చేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
రూ.12 వేలు చెల్లిస్తే సదరు టెక్నీషియన్ ఆడ శిశువా, మగ శిశువా అని చెప్పేస్తాడు. పరిస్థితి బాగాలేదు అని చెప్పి మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తాడని తెలిసింది. ఆ 12 వేల రూపాయల్లో పంపించిన వారికి కమీషన్ కూడా చెల్లిస్తాడు. అబార్షన్‌కు రూ.30 వేలు తీసుకుంటాడని సమాచారం. అబార్షన్ కోసం వచ్చిన మహిళలను వైద్య పరీక్షల కోసం హనుమకొండలోని ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు తెలిసింది. కాగా, డీఎంహెచ్‌వో సాంబశివరావు, డీసీపీ పుష్ప, కేయూసీ సీఐ దయాకర్, అడిషనల్ డీఎంహెచ్‌వోతో పాటు పలువురు అధికారులు స్కానింగ్ సెంటర్‌ను పరిశీలించారు.