ములుగు జిల్లాలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ సర్కారు రూ. 65కోట్లు మంజూరు చేసింది. అప్ప టి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న ఐదెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. 2022, జూన్ 7వ తేదీన కలెక్టరేట్ నిర్మాణ పనులకు అప్పటి మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌లు శంకుస్థాపన చేశారు. అప్పుడు ఏడాదిలో పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినప్పటికి ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో బిల్లుల చెల్లింపు విషయంలో ఆలస్యం కారణంగా పనులు సాగుతున్నట్లు తెలుస్తున్నది. పనులు పర్యవేక్షించాల్సిన ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యంతో కూడా కలెక్టరేట్ నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి.
2022లో పనులు శంకుస్థాపన చేసినప్పుడు సమీకృత కలెక్టరేట్‌ను 2023 దసరా పండుగ వరకు పూర్తి చేయాలని నిర్దేశించుకున్నారు. రెండేళ్లుగా కొనసాగుతున్న పనులు ప్రస్తుతం 80 శా తం మేర పూర్తయ్యాయి. వచ్చే దసరా పండుగ వరకైనా పనులు పూర్తవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీ ప్లస్ 2లో నిర్మిస్తున్న కలెక్టరేట్లో రెండు అంతస్తుల్లో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్లాస్టరింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పుట్టి, ఫాల్ సీలింగ్ పనులు జరుగుతున్నాయి. కలెక్టరేట్ చుట్టూ ప్రహరీ నిర్మాణం కొనసాగుతుండగా మెయిన్ గేటు వద్ద ఆర్చీ నిర్మాణ పనులు నడుస్తున్నాయి. కలెక్టరేట్ పక్కన సిబ్బంది కోసం నిర్మిస్తున్న రెండు భవనాల పనులు ఇంకా 50 శాతం కూ డా పూర్తి కాలేదు.
100 శాతం భవన, ప్రహరీ నిర్మాణ పనులు, గార్డెనింగ్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ పనులు పూర్తి కావాలంటే మరి కొన్ని నెలల సమయం పడుతుందని ఇంజినీరింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రోడ్డు భవనాల శాఖలో పూర్తిస్థాయి ఈఈ అధికారి లేక డీఈ అధికారి అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండడంతో నిర్మాణ పనుల్లో పర్యవేక్షణ లేకపోవడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. పనుల జాప్యం విషయమై అర్అండ్బీ ఇన్చార్జి ఈఈని ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కార్యాలయానికి వెళ్లినా ఉండకపోవడంతో పాటు కిందిస్థాయి సిబ్బంది చెప్పే సమాధానాలు పొంతన కుదరడం లేదు. జిల్లా కలెక్టర్ స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు సమీకృత పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.