Congress | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): సందర్భం ఏదైనా నోరు ఎత్తితే ప్రభుత్వం వద్ద పైసలు లేవని సీఎం రేవంత్రెడ్డి చెప్తుంటారు. తనను నిలువునా కోసినా పైసలు లేవని అంటుంటారు. కానీ, ఇటీవల వికారాబాద్ అనంతగిరిలోని హరిత రిసార్ట్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ శిక్షణ కార్యక్రమానికి ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారు. హరిత రిసార్ట్ మరమ్మతులకు రూ.81 లక్షలను తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖర్చు చేసింది. అది కూడా ఎలాంటి టెండర్లు పిలువకుండానే ‘సురభి కన్స్ట్రక్షన్స్’కు పనులను అప్పగించింది. ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదమవుతున్నది. టెండర్లు పిలువకుండానే ఒక కంపెనీకి పనులు ఎందుకు అప్పగించారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా హరితహోటళ్లు, రిసార్టులు అనేకం ఉన్నాయని, వాటిలో చాలా హోటళ్లు అనంతగిరి రిసార్ట్ మాదిరిగానే పడావుపడుతున్నాయని గుర్తు చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ ఒక్కదానిని కూడా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా వికారాబాద్ జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్ ఎందుకు గుర్తుకు వచ్చిందని, హడావుడిగా పనులు ఎందుకు చేయించారని అడుగుతున్నారు. ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన ప్రజాధనాన్ని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల కోసం ఖర్చు చేస్తున్నారంటూ మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన భరత్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. పలువురు ఇతర నాయకులు సైతం కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం టూరిజం శాఖపై విచారణ జరపాలని, టెండర్లు లేకుండా నిధులు ఖర్చు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.