గణపురం, మే25 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి మాయిశ్చర్ వచ్చినా అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత అకాల వర్షం వచ్చి మండలంలోని బస్వరాజుపల్లిలో చేతికొచ్చిన పంట నీళ్ల పాలైంది. సుమారు 50 ఎకరాల ధాన్యం మొలకెత్తింది. ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకొస్తే మాయిశ్చర్ వచ్చినా అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వంతో సకాలంలో గన్నీ బ్యాగులు అందించలేదు. దీంతో వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయింది.
మాయిశ్చర్ వచ్చి బస్తాలు నింపిన వడ్లను కూడా ట్రాన్స్పోర్టర్ నిర్లక్ష్యంతో సకాలంలో మిల్లులకు తరలించకపోవడంతో పూర్తిగా తడిసిపోయి మొలకెత్తాయి. అధికారుల నిర్లక్ష్యమే తమకు శాపంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 ఎకరాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోశామని, మాయిశ్చర్ వచ్చినప్పుడు రాని అధికారులు ఇప్పుడు వచ్చి మాయిశ్చర్ లేదు, గన్నీ బ్యాగులు ఇవ్వొద్దని, కొనుగోలు చేయమని చెబుతున్నారని వారు వాపోయారు. ఇప్పటికే నిండా మునిగిన మమ్మల్ని ప్రభుత్వం ఆదు కోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని, జిల్లా యంత్రాంగం స్పందించి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వడ్లు తడిసి మొలకెత్తినయ్..
నాలుగు ఎకరాల్లో వరి పంట సాగు చేసిన. 20 రోజుల క్రితం కోత కోసి ధాన్యం ఆరబెట్టిన. సకాలంలో గన్ని బ్యాగులు ఇవ్వలేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు వడ్లు మొత్తం తడిసినయ్. మొలుకెత్తినా కూడా కేంద్రం నిర్వాహకులు, అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు మాయిశ్చర్ లేదు కొనమంటున్నరు. తడిసిన వడ్లను కొనుగోలు చేసి ఆదుకోవాలి.
– సైండ్ల తిరుపతి, రైతు, బస్వరాజుపల్లి
మా గోస పట్టించుకోండి
22 రోజుల క్రితం రెండెకరాల పొలం కోసి వడ్లు ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. మాయిశ్చర్ వచ్చినా రేపు, మాపు అంటూ బార్దాన్ ఇవ్వలేదు. తర్వాత వర్షం వచ్చి ధాన్యం తడిసింది. ఇప్పుడు మాయిశ్చర్ లేదని కొనుగోలు చేయడం లేదు. ఎమ్మెల్యే వచ్చి అధికారులను ధాన్యం తీసుకోమని చెప్పినా అధికారుల్లో చలనం లేదు. ఇప్పటికైనా మా గోస పట్టించుకోండి.
– మారేపల్లి లక్ష్మి, రైతు, బస్వరాజుపల్లి