వరంగల్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ)/హనుమకొండ/కురవి : ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయని రైస్‌మిల్లులపై పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక అధికారులతో కలిసి శుక్ర, శనివారాల్లో దాడులు చేశారు. వరంగల్ జిల్లాలో మూడు రైస్‌మిల్లుల్లో 2022-23 రబీ సీజన్లో ప్రభుత్వం కేటాయించిన సుమారు రూ.27.16 కోట్ల ధాన్యం లేదని గుర్తించారు. దీంతో ఈ మూడు మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ధాన్యం లేదని తేలడంతో వాటిని సీజ్ చేశారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలోని లక్ష్మీశ్రీగణపతి రైస్‌మిల్లు, సంగెం మండలం కాపులకనపర్తిలోని సతీశ్, సాయి ఇండస్ట్రీ రైస్‌మిల్లులకు సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయించింది.
ఈ ధాన్యాన్ని సదరు రైస్‌మిల్లర్లు నూర్పిడి చేసి ప్రభుత్వానికి సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉండగా చేయలేదు. ప్రభుత్వం పలుమార్లు గడువు ఇచ్చినా రైస్‌మిల్లర్లు పెడచెవిన పెట్టడంతో అధికారులను రంగంలోకి దింపింది. ఇల్లందలోని లక్ష్మిశ్రీగణపతి రైస్‌మిల్లులో సుమారు 4,691, కాపులకనపర్తిలోని సతీశ్ ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో 3,532, సాయి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో 2,588 టన్నుల ధాన్యం నిల్వలు లేవని గుర్తించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి వెల్లడించారు. ప్రభుత్వ ధర ప్రకారం లక్ష్మిశ్రీగణపతి రైస్‌మిల్లులో లేని ధాన్యం విలువ రూ.11.21 కోట్లని, 25శాతం పెనాల్టీతో ఇది రూ.15 కోట్లకు చేరిందని జిల్లా మేనేజర్ సంధ్యారాణి తెలిపారు. అలాగే సతీశ్ ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో లేని ధాన్యం విలువ రూ.9.64 కోట్లు కాగా పెనాల్టీతో రూ.13 కోట్లకు పెరిగినట్లు ఆమె చెప్పారు. శ్రీసాయి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో లేని ధాన్యం విలువ రూ.6.31 కోట్లు కాగా పెనాల్టీతో ఇది రూ.8.65 కోట్లకు చేరిందని డీఎం తెలిపారు. ఈ మూడు రైస్‌మిల్లుల యజమానులు కే శ్రీనివాస్, సతీశ్, సురేశ్‌పై క్రిమినల్ కేసుల నమోదు కోసం వర్ధన్నపేట, సంగెం పోలీస్స్టేషన్లలో శనివారం ఫిర్యాదు చేయడంతో పాటు మూడు రైస్‌మిల్లులను సీజ్ చేసినట్లు సంధ్యారాణి తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్లలోని నవ్య ఇండస్ట్రీస్(పారాబాయిల్డ్ రైస్‌మిల్లు)పై శనివారం ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌పోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 2022-23 రబీ సీజనలో ప్రభుత్వం మిల్లుకు 53,560 క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించగా 36,420 క్వింటాళ్ల బియ్యాన్ని సీఎంఆర్ పెట్టాల్సి ఉంది. కానీ కేవలం ఇప్పటివరకు 8,871 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి అందచేయగా తనిఖీల్లో కేవలం 6,238 క్వింటాళ్ల మాత్రమే నిల్వ ఉన్నట్లు తేలింది. 34,275 క్వింటాళ్లు వ్యత్యాసం రాగా వాటి విలువ రూ.8కోట్ల 36లక్షల 94వేల 755 ఉంటుందని ఓఎస్డీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు తెలిపారు. మిల్లు యజమాని నాగరాజుపై కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో జిల్లా సివిల్ సైప్లె అధికారి కృష్ణవేణి, ఏఎస్వో రమేశ్, రవీందర్, ఆర్ఐ లక్ష్మి పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి మండలం సూరారంలోని శ్రీబాలాజీ ఇండస్ట్రీస్, ఐనవోలు మండలం పున్నేలులోని నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల యజమానులపై పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు డీసీఎస్వో ఉమారాణి తెలిపారు. ఈ రెండు మిల్లుల్లో శుక్రవారం దాడులు చేసిన అధికారులు ఇచ్చిన ధాన్యం, పెట్టాల్సిన సీఎంఆర్ బియ్యం, పెట్టిన బియ్యం, ఉండాల్సిన వాటిలో పెద్ద మొత్తంలో తేడాలు ఉన్నట్లు గుర్తించారని, శ్రీబాలాజీ ఇండస్ట్రీస్‌లో మాయమైన బియ్యం బస్తాల విలువ సుమారు రూ.11.78కోట్లు ఉంటుందని, నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.7.12కోట్ల విలువైన బియ్యం మాయమైందని నివేదిక సమర్పించారు. దీంతో మిల్లుల యజమానులపై శనివారం క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.