గీసుగొండ, ఫిబ్రవరి 21: మాతా శిశు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం న్యూట్రిషన్ సప్లిమెంటరీ ప్రోగ్రాం చేపట్టింది. అందులో భాగంగా పిల్లలకు బాలామృతం, గర్భిణులు, బాలింతలకు బాలామృతం ప్లస్ పంపిణీ చేస్తోంది. గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య పరిష్కారానికి ఇప్పటికే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తోంది. పిల్లలకు కూడా త్వరలోనే అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 919 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 49,080 మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోంది. అందులో అంగన్వాడీ టీచర్లు కొలతల ప్రకారం బియ్యం, పప్పు, వంట నూనె, కోడిగుడ్డు, పాలు ఉండేలా చూస్తున్నారు. స్నాక్స్, వారాని కోసారి మజ్జిగ కూడా అందిస్తున్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌తో పిల్లలు రక్తహీనత సమస్యను అధిగమించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంక్షేమ చర్యల్లో భాగంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకంలో న్యూట్రిషన్ సప్లిమెంటరీ ప్రోగ్రాంను అమలు చేస్తోంది. అందులో భాగంగా గర్భిణుల్లో రక్తహీనతతో పుట్టిన పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తోంది. పిల్లలకు బాలామృతం, గర్భిణులు, బాలింతలకు బాలామృతం ప్లస్ పంపిణీ చేస్తోంది. అయినా గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య ఉండగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తోంది. పిల్లల్లోనూ ఈ సమస్య పరిష్కరానికి జిల్లాలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఆరోగ్య సలహాలు, సూచనలు చేస్తున్నారు. వారు తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలను అంగన్వాడీ టీచర్లు వివరిస్తున్నారు.
919 కేంద్రాలు..
49,080 మందికి సేవలు
జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ నియోకవర్గాల వారీగా 13మండలాల పరిధిలో మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో అంగన్వాడీలు, అంగన్వాడీ కేంద్రాలు 919 ఉండగా, ఆరోగ్యలక్ష్మీ పథకం కింద గర్భిణులు 5,506, బాలింతలు 5,200 మందికి పోషకాహారం అందిస్తున్నారు. ఆరు నెలలోపు పిల్లలు 5,506, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 24,210, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 8,658 మంది సేవలు పొందుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ప్రభుత్వం అందించే పౌష్టికాహారం తీసుకుంటున్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. పౌష్టికాహారం అందించటంతోపాటు పిల్లలు, గర్భిణులు, బరువు, కొలతలు నమోదు చేస్తున్నారు.
కొలతల ప్రకారం పౌష్టికాహారం
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు రోజూ 150 గ్రాముల బియ్యం 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల వంట నూనె, ఒక కోడి గుడ్డుతో కూడిన ఆహారం వండి అందిస్తున్నారు. 200 మిల్లీలీటర్ల పాలు, వారంలో ఒకసారి మజ్జిగతో కూడా ఇస్తున్నారు. పిల్లలకు మధ్యాహ్నం స్నాక్స్ సైతం అందిస్తున్నారు. ఐరన్ లోపంతో వచ్చే రక్తహీనత సమస్య నుంచి చాలామంది అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే ఫుడ్ ద్వారా బయటపడుతున్నారు. ఎలాంటి వెళ్లకుండా, పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకునేలా సిబ్బంది గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆకుకూరలు, పాలు, పండ్లు, మాంసకృత్తులు గల ఆహారం తీసుకోవటంతో ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వాలని గర్భిణులు సూచనలు చేస్తున్నారు.
రక్త హీనతకు ఐరన్ మాత్రలు
తెలంగాణ ప్రభుత్వం బాలింతలకు ఆరోగ్య కేంద్రాల్లో ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రలు ఇస్తోంది. వీటితో రక్తపుష్టి చేకూరుతుంది. ఐరన్ ఉండే తోటకూరలు, మెంతి, బచ్చలి, గంగవాయిలి, తదితర ఆకుకూరలు రోజూ ఆహారంలో తీసుకోవాలని అంగన్వాడీలు గర్భిణులు, బాలింతలకు సూచిస్తున్నారు.