వరంగల్, సెప్టెంబర్ 8 : భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో దెబ్బతిన్న సెక్షన్లలో వేగంగా పునరుద్ధరణ పనులను చేపట్టాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నక్కలగుట్ట ప్రధాన కార్యాలయం నుంచి ఖమ్మం, మహబూబాద్ సూపరింటెండెంట్లు, డివిజన్ ఇంజినీర్ల(ఆపరేషన్స్)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మహబూబాబాద్ సర్కిల్లో భారీ నష్టం జరిగిన డోర్నకల్, గార్ల, కొత్తపేట, సీరోల్, మరిపెడ, చిన్నగూడూరులో పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచేందుకు మరింత సిబ్బందితో పాటు అదనపు కాంట్రాక్టర్లను నియమించుకోవాలని ఆదేశించారు. మిగతా వింగ్‌లలో పనిచేసే డీఈ, ఏఈలను క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు వినియోగించుకోవాలన్నారు. అవసరం అయితే లైన్లను రీ రూటింగ్ చేయాలన్నారు. వాగుల నుంచి 500 మీటర్ల దూరంలో 9.1 మీటర్ల స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. గుండ్రాతి మడుగు, మరిపెడ -1, 11, చిన్న గూడూరు ఫీడర్ల వద్ద పురోగతిలో ఉన్న 33కేవీ లైన్ పనులను పర్యవేక్షించాలని సీఈ కన్స్ట్రక్షన్, డీఈ/ఎంఆర్టీ కన్స్ట్రక్షన్లను కోరారు.
వరదలతో దెబ్బతిన్న 3,800 స్తంభాలు, 270 ట్రాన్స్ఫార్మర్ గద్దె లు, నీట మునిగిన 290 ట్రాన్స్ఫార్మరను మార్చాలన్నారు. ఖమ్మం సర్కిల్ పరిధిలో దెబ్బతిన్న కూసుమంచి, పాలేరు, ముదిగొండ, పమ్మి, ఆరెంపుల, పల్లి గూడెం, ప్రకాశ్‌నగర్‌లో పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఇన్చార్జి డైరెక్టర్ ఆపరేషన్స్ మధుసూదన్, సీజీఎంలు కిషన్, అశోక్, బికంసింగ్, జీఎంలు నాగప్రసాద్, అన్నపూర్ణ, ఎస్ఈ అంకుష్ పాల్గొన్నారు.