గార్ల, ఆగస్టు 25 : గత కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ యూరియా కొరత లేదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఎదుట ఆమె రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి యూరియా కొరతపై సోమవారం ధర్నా నిర్వహించారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి సుమారు 500 మంది రైతులు పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తున్న తరుణంలో ఆమె అక్కడకు చేరుకొని ఆందోళన చేశారు.
మండల వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రైతులు నానా అవస్థలు పడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ అధికారులు చొరవ తీసుకొని రైతులకు కావాల్సినంత యూరియా అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ తరఫున దశల వారి ఆందోళనలు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేశ్, నాయకులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.