సిటీబ్యూరో/మన్సూరాబాద్/ఎల్బీనగర్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు మూసీ ప్రాజెక్టు పేరిట జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదని, రెండున్నరేండ్లలోనే లక్షన్నర కుటుంబాలను రోడ్డున పడేసే కుట్రలు పన్నుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్పేట్ నియోజకవర్గాల పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన మూసీ అభివృద్ధిని పరిశీలించారు. నాగోలు ఎస్టీపీ ప్లాంట్‌ను సందర్శించడంతో పాటుగా నాగోలు బ్రిడ్జి వద్ద వాకింగ్ ట్రాక్, సుందరీకరణ చేసిన ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘యూపీలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందన్న రాహుల్ గాంధీ… మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నర ఇండ్లను కూల్చివేస్తుంటే ఎలా సహిస్తున్నారు.. రెండున్నరేండ్లలోనే లక్షన్నర కుటుంబాలను రోడ్డున పడేసేలా ఉన్న రేవంత్ రెడ్డి ప్రణాళికలను ఎందుకు అడ్డుకోవడం లేదు’ అని ప్రశ్నించారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పేదల ఇండ్లను కూల్చివేసే కుట్రలను, కాంగ్రెస్ బుల్డోజర్లను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఎస్టీపీ ప్లాంట్ సందర్శనం అనంతరం భారీ ఊరేగింపుతో నాగోలు మూసీ బ్రిడ్జి ప్రాంతాన్ని సందర్శించి వాకింగ్ ట్రాక్‌పై పాదయాత్ర చేసి అక్కడ మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న బాధితులతో మాట్లాడారు. ఒక్క ఇటుక కూల్చకుండా బీఆర్ఎస్ సర్కారు మూసీని అభివృద్ధి చేస్తే… లక్షల ఇండ్లను నేలమట్టం చేసి పేద ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు.

ఎల్బీనగర్, నాగోల్‌లోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పరిశీలించిన కేటీఆర్… అరగంట పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనితీరును అక్కడి సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. మురుగు నీటిని శుద్ధి చేయక ముందు, శుద్ధి చేసి తర్వాత నీటి నాణ్యతను ఎస్టీపీ సిబ్బంది కేటీఆర్‌కు వివరించారు. సీక్వెన్షల్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్బీఆర్) టెక్నాలజీతో నీటిని శుద్ధి చేస్తున్నట్లు తెలుపగా.. అధికారులను కేటీఆర్ ప్రోత్సహించారు. అనంతరం కేటీఆర్ ప్లాంట్‌పై ఎక్కి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనితీరును గమనించారు. నాగోల్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్దదని, నిత్యం 320 ఎంఎల్డీల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉందని, నగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిలో 20 శాతం ఇక్కడే శుద్ధి చేయవచ్చని అధికారులు వివరించారు.

మూసీ అభివృద్ధి పేరిట కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఆరాచాకాన్ని అడ్డుకునేందుకు వచ్చిన కేటీఆర్‌కు నాగోలు, కొత్తపేట డివిజన్ ప్రాంతాల జనాలు ఘనస్వాగతం పలికారు. దిల్సుఖ్నగర్ నుంచి నాగోలు ఎస్టీపీ ప్లాంట్ వరకు ఇన్నర్ రింగ్‌రోడ్డులో నాగోలు నుండి ఉప్పల్ మార్గంలో బ్రిడ్జి వరకు అడుగడుగునా ప్లెక్సీలతో కేటీఆర్‌కు నీరాజనం పలికారు. నాగోలు ఎస్టీపీ ప్లాంట్ నుంచి సాయిరాం గార్డెన్స్ వరకు అడుగడుగునా కేటీఆర్ బాధితులకు భరోసా ఇస్తూ ముందుకు సాగారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ల్యే కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ నేతలు మహమూద్ అలీ, క్యామ మల్లేష్, లక్ష్మారెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.