Assam Govt : బహుభార్యత్వాన్ని నిర్మూలించే దిశగా కీలక చర్యలు చేపడుతున్న అస్సాం సర్కారు (Assam Govt).. అందుకోసం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) జీతాల్లో కోత పెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) సోమవారం కీలక ప్రకటన చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా చట్టబద్ధంగా తన భార్య నుంచి విడాకులు తీసుకోకుండా ఆమెను వదిలేసి మరో మహిళతో వివాహ బంధం ఏర్పరుచుకుంటే సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని సీఎం తన ప్రకటనలో హెచ్చరించారు. ఆ ఉద్యోగి జీతం నుంచి 20 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని మొదటి భార్య బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తామని తెలిపారు. అయితే ఆ ఉద్యోగి మొదటి భార్య దీని గురించి ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఎం చెప్పారు.
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది విడాకుల ప్రక్రియ పూర్తికాకుండానే మరో మహిళతో కలిసి ఉంటున్న కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిమంత తెలిపారు. విడాకుల అంశం కోర్టు వద్ద పెండింగ్లో ఉన్నా కూడా.. జీతంలో కోత కొనసాగుతుందని స్పష్టంచేశారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎదురుచూడకుండా మొదటి భార్యకు ఆర్థిక సహకారం అందించాలనేదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఇక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో 10 శాతం కోత విధించనున్నట్లు హిమంత తెలిపారు.