S Jaishankar : భారత్-అమెరికా (India-UA) సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి (Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం (Terrorism) పై భారత్ ఆందోళనలను భాగస్వామ్య దేశాలు గుర్తించకపోతే, అది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టంచేశారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఒక ‘రెడ్ లైన్ (Red Line)’ గీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని వ్యాఖ్యానించారు. భారత్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ (Pakistan) పట్ల అమెరికా సానూకూల ధోరణి కనబరుస్తున్న నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఉన్నతస్థాయి సమావేశాల అనంతరం న్యూయార్క్‌లో ‘ఏషియా సొసైటీ’ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగించారు. దశాబ్దాలుగా పొరుగు దేశం ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుని భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటోందంటూ పాకిస్థాన్ పేరును ప్రస్తావించకుండానే జైశంకర్ దుయ్యబట్టారు. అత్యంత కీలకమైన ఉగ్రవాద సమస్యపై మా భాగస్వామ్య దేశాల నుంచి సరైన అవగాహన, సానుభూతి లభించకపోతే అది కచ్చితంగా ఇబ్బందులకు దారితీస్తుందని అన్నారు. మా ప్రాథమిక ఆందోళనలను విస్మరిస్తే సంబంధాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.
భారత్-అమెరికా సంబంధాలను ప్రభావితం చేసే అంశాల్లో వాణిజ్య, టారిఫ్ వివాదాలతోపాటు ఉగ్రవాదం కూడా ప్రధానమైనదని జైశంకర్ చెప్పారు. భారత్-అమెరికా బంధం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నప్పటికీ, పరిష్కరించాల్సిన సమస్యల విషయంలో వాస్తవిక దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పొరుగు దేశం నుంచే మద్దతు అందుతోందని నిరూపించేందుకు భారత్ పదేపదే తగిన ఆధారాలను సమర్పించిందని ఆయన గుర్తుచేశారు.