Delhi airport : అక్రమంగా తరలిస్తున్న డ్రోన్లు, డ్రోన్ విడిభాగాలను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ముగ్గురు భారతీయ ప్యాసింజర్ల దగ్గర నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీరు హాంకాంగ్ నుంచి వియత్నం ద్వారా ఢిల్లీ చేరుకున్నారు. సెప్టెంబర్ 25న, టెర్మినల్-3 వద్ద తనిఖీలు నిర్వహించగా ఇవి భారీ స్థాయిలో పట్టుబడ్డాయి. 11 రోబోటిక్స్ డ్రోన్స్, అడాప్టర్స్, యూఎస్బీ ఛార్జర్స్, 60 ప్రొపెల్లర్స్, 10 కెమెరా ఎక్విప్డ్ జింబాల్స్ సహా మరికొన్ని ఎలక్ట్రానిక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే, ఒక ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి రెగ్యులర్ యూజ్ ఐటమ్స్ కావని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో కొన్ని ప్రొఫెషనల్, డిఫెన్స్ గ్రేడ్ యూఏవీల ఉన్నాయి. అలాగే, థర్మల్ ఇమేజింగ్, లేజర్ రేంజ్ ఫైండర్ క్యాపబులిటీస్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రకమైన డ్రోన్లు వాడాలంటే వీటిని డీజీసీఏ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటి మార్కెట్ విలువ రూ.కోటి పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఒక స్నేహితుడి కోసం ఈ డ్రోన్లు తెచ్చామని ప్యాసింజర్లు చెప్పినట్లు అధికారులు అన్నారు.
అయితే, ఈ వివరాల్ని విమాన ప్రయాణానికి ముందు కస్టమ్స్ అధికారులకు వెల్లడించలేదన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. ఇంతకుముందు కూడా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రూ.కోటిన్నర విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.