,మార్చి 5: మిడిల్ ఈస్ట్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం.. దేశీయ ఔషధ పరిశ్రమకు భారీ నష్టాలనే తెచ్చిపెట్టేలా ఉన్నది. ఫార్మెక్సిల్ అంచనాల ప్రకారం.. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా సరుకు రవాణాకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని, దీంతో భారతీయ ఔషధ పరిశ్రమకు రూ.2,500-5,000 కోట్ల మేర నష్టాలు వాటిల్లవచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం భారతీయ ఔషధ ఎగుమతుల్లో గల్ఫ్ సహకార మండలి (జీసీసీ)లోని దేశాల వాటా 5.58 శాతంగా ఉన్నది. ‘మాకు అందిన తాజా వివరాల ప్రకారం మిడిల్ ఈస్ట్‌కు భారత్ నుంచి జరుగుతున్న ఔషధ ఎగుమతులు ఏటేటా పెరుగుతున్నాయి. 2020-21లో ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల విలువ 1,320.44 మిలియన్ డాలర్లుగా ఉన్నది.
అయితే 2024-25లో ఇది 1,749.68 మిలియన్ డాలర్లకు పెరిగింది’ అని ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు. యూఏఈ, సౌదీ, ఒమన్, కువైట్, యెమన్ వంటి దేశాలు భారత్ నుంచి చౌకగా వచ్చే ఔషధాలు, ముఖ్యంగా జనరిక్ మెడిసిన్స్‌పైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయన్నారు. ఇక జోర్డాన్, కువైట్, లిబియా వంటి దేశాల్లోనూ వ్యాక్సిన్లు, సర్జికల్ ఉత్పత్తులు, ఆయుష్ ఫార్ములేషన్లు తదితర భారతీయ ఔషధాలు, ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరుగుతున్నట్టు చెప్పారు. కానీ అంతర్జాతీయ సరుకు రవాణా మార్కెట్లో ఇప్పుడున్న సవాళ్లు.. భారతీయ ఔషధ ఎగుమతులపై పెద్ద ప్రభావాన్నే చూపవచ్చని హెచ్చరించారు.