సికింద్రాబాద్: బల్దియా ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. మూషీరాబాద్ సర్కిల్ కార్యాలయం ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వహించిన ఆంజనేయులు తనకు రావాల్సిన బెనిఫిట్స్‌ను ఇప్పించాల్సిందిగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలోని ఫైనాన్స్ విభాగంలో ఎగ్జామినర్ ఆఫ్ అకౌంటెంట్ అధికారి సంతోష్‌ను కోరారు. అతడు ఆరు నెలలుగా తిప్పుకుంటూ..నాలుగు రోజుల కింద తనకు రూ. 40వేలు ఇస్తే బెనిఫిట్స్ ఇప్పిస్తానని చెప్పాడు.
దీంతో ఆంజనేయులు రూ. 35వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో సంతోష్ రూ. 35వేలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంతోష్ ఇంటివద్ద కూడా తనిఖీలు చేస్తున్నామని, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు.