బయ్యారం, నవంబర్ 21 : రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో బతుకు గడిచే దెట్లా.. అని నేషనల్ హెల్త్ మిషన్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ఎన్హెచ్ఎం కింద 2006-23 వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2256 (మహబూబాబాద్ 444, హనుమకొండ 440, వరంగల్ 441, జనగామ 345, భూపాలపల్లి 260, ములుగు 310) మంది ఉద్యోగులను నియమించారు. ఇందులో వైద్యులు, స్టాఫ్ నర్స్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అటెండర్లు , ఎల్టీ, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు , డీపీఎంయూలు, ఎంఎల్హెచ్పీ వంటి 74 క్యాడర్లకు చెందిన వారు ఉన్నారు.
వీరికి 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను చెల్లిస్తుంది. అయితే గత కేసీఆర్ ప్రభుత్వ హయాం లో నెల మొదటి వారంలోనే వేతనాలు అందగా, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక సకాలం లో అందక ఇబ్బంది పడుతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కుటుంబాలు గడువక అప్పులు చేసి ఆర్థిక భారం తో ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల క్రితం కలెక్టర్, డీఎంహెచ్వో కార్యాలయాల ఎదుట ఆందోళన చేసి వినతి పత్రాలు అందించారు. రెండు రోజుల క్రితం స్టేట్ ఎన్హెచ్ఎం ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెండింగ్ వేతనాలు, పీఆర్సీ వెంటనే చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం చొరవ తీసుకొని ఎన్హెచ్ఎం ఉద్యోగుల వేతనాలను వెంటనే చెల్లించాలి. గత రెండు నెలలుగా వేతనాలందక ఇల్లు గడవని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. వేతనాలతో పాటు పీఆర్సీ చెల్లించాలి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం.
– ఎండీ రుక్ముద్దీన్, ఎన్హెచ్ఎం ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు