హనుమకొండ, డిసెంబర్ 22 : పదవీ కాలం ముగిసిన రెండేళ్ల అనంతరం ఎట్టకేలకు పల్లెల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపొందిన సర్పంచ్‌లు 1683 మంది, 14,778 మంది వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు నూతన పాలక వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది. అలాగే పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తగ్గనుంది. కాగా పాలక వర్గం ప్రమాణ స్వీకారో త్సం సందర్భంగా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలను ముస్తాబు చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్ర మాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ ప్రశాంతంగా జరగగా, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో బీఆర్ఎస్ వార్డు సభ్యుడిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశా రు.
అలాగే ఎన్నికల ప్రచార సందర్భంగా ఇచ్చిన హామీలను కొందరు సర్పంచ్‌లు సోమవారం నుంచి అమలు చేస్తున్నారు. దీనికి తోడు పంచాయతీలకు పెద్ద దిక్కుగా ఉండే 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. కాగా, ప్రమాణ స్వీకారం సందర్భంగా పాలకుర్తి, తొర్రూరులో జరిగిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని సర్పంచ్‌లను అభినందించారు. అలాగే నడికూడ మండలం వరికోల్‌లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.