కరీమాబాద్, ఏప్రిల్ 28 : నవోదయ పరీక్షకు వేళయ్యింది. జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ నెల 30న పరీక్షలు జరుగనున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు 6,914 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మామునూరు నవోదయంలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న వారందరికీ శనివారం వారికి కేటాయించిన కేంద్రాల్లో ఉదయం 11గంటల 30 నిమిషాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాను 15 బ్లాకులుగా విభజించి పరీక్షా కేంద్రాలను కేటాయించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఒకరోజు ముందే ఎగ్జామ్ సెంటర్‌ను సరిచూసుకోవాలని సిబ్బంది సూచించారు.
1. చేర్యాల బ్లాకులో చేర్యాల, బచ్చన్నపేట, నర్మెట్ట, మద్దూర్ మండలాలు ఉన్నాయి.
2.చిట్యాల బ్లాకులో చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాలు ఉన్నాయి.
3.ఏటూరునాగారం బ్లాక్‌లో ఏటూరునాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేట మండలాలు ఉన్నాయి.
4. స్టేషన్ ఘన్పూర్ బ్లాక్‌లో స్టేషన్ ఘన్పూర్, జఫర్ఘడ్ మండలాలు ఉన్నాయి.
5. గూడూరు బ్లాక్‌లో గూడూరు, కొత్తగూడ, నల్లబెల్లి, ఖానాపూర్ మండలాలు ఉన్నాయి.
6.హనుమకొండ బ్లాక్‌లో హసన్‌పర్తి, హనుమకొండ, ధర్మసాగర్ మండలాలు ఉన్నాయి.
7.జనగామ బ్లాక్‌లో జనగామ, రఘునాథపల్లి, ఘన్పూర్(లింగాల) మండలాలు ఉన్నాయి.
8.కొడకండ్ల బ్లాక్‌లో కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పల మండలాలు ఉన్నాయి.
9. మహబూబాబాద్ బ్లాక్‌లో మహబూబాబాద్, కేసముద్రం, కురవి, డోర్నకల్ మండలాలు ఉన్నాయి.
10.మరిపెడ బంగ్లా బ్లాక్‌లో మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, నెల్లికుదురు మండలాలు ఉన్నాయి.
11. ములుగు బ్లాక్‌లో ములుగు, వెంకటాపూర్, గణపురం(ఎం) మండలాలు ఉన్నాయి.
12. నర్సంపేట్ బ్లాక్‌లో నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట్, నెక్కొండ మండలాలు ఉన్నాయి.
13. పరకాల బ్లాక్‌లో పరకాల, రేగొండ, శాయంపేట మండలాలు ఉన్నాయి.
14. వరంగల్ బ్లాక్‌లో ఆత్మకూరు, సంగెం, గీసుగొండ, వరంగల్ మండలాలు ఉన్నాయి.
15. వర్ధన్నపేట బ్లాక్‌లో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాలు ఉన్నాయి.
విద్యార్థులు పరీక్షకు బయలుదేరే ముందే అన్నీ సరిచూసుకోవాలి. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రవేశ పత్రం( అడ్మిట్‌కార్డు, హాల్‌టికెట్) రెండు కాపీలు ప్రింట్ తీసుకోవాలి. వాటిపై తమ ప్రధానోపాధ్యాయులతో సంతకం చేయించి పాఠశాల ముద్ర వేయించుకోవాలి. వాటిని సర్టిఫై చేసుకొని పరీక్ష గదికి తీసుకొని రావాలి. ఒక సెట్‌ను ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. ఒత్తిడికి గురికావద్దు. వీలైతే ముందురోజే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి.
– పూర్ణిమ, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ, మామునూరు