చిట్యాల, జనవరి 5 : కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగావడం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పది నెలల క్రితం ఇసుక అక్రమ రవాణా కోసం అధికార పార్టీ నాయకులు పేల్చివేసిన చిట్యాల మండలంలోని నవాబుపేట చెక్ డ్యాంను రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భం గా గండ్ర మాట్లాడుతూ రైతుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చలివాగుపై రూ. 10 కోట్లతో చెక్ డ్యాం నిర్మించిందన్నారు. దీంతో మొగుళ్లపల్లి, చి ట్యాల మండలాలకు సాగునీరు అందిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
పది నెలలైనా ధ్వంసమైన చెక్ డ్యాంకు మరమ్మతు చేయకపోవడం స్థానిక ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే సహకారంతోనే అధికార పార్టీ నాయకులు బ్లాస్టింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించారు. అందుకు రిపేర్లు చేయకపోవడం, కారకులను శిక్షించకపోవడమే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా చెక్ డ్యాం మరమ్మతు పనులు చేపట్టాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన ఆందోళనలను ఉధృతం చేస్తామని గండ్ర హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్, మండల వరింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేశ్, కైలాపూర్ సర్పంచ్ కొడారి ఓదెలు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సాదరాజు, దానవేని రమేశ్, నాయకులు వల్లబోజు నరేశ్, చింతల సదానందం, పర్లపల్లి భద్రయ్య తదితరులున్నారు.