హనుమకొండ చౌరస్తా, జనవరి 2 : ఈ నెల23, 24, 25 తేదీల్లో ఖమ్మంలో జరిగే పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ర్ట 23వ మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహరావు పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద రాష్ర్ట 23వ మహాసభ ఆహ్వాన సంఘం కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింహరావు మాట్లాడుతూ 79 ఏళ్ల స్వాతంత్య్రపాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా నాణ్యమైన సమాన విద్యనందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలకు అప్పగించి విద్యావ్యవస్థను పూర్తిగా వ్యాపారమయం చేశారని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు విద్యారంగా అభివృద్ధిని, విద్యార్థుల సంక్షేమాన్ని, విశ్వవిద్యాలయాల పరిరక్షణను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు. విద్యారంగాన్ని కాషాయికరించి, విద్యార్థుల మెదల్ల లో కుల, మత విష బీజాలు నాటుతూ దేశంలో మతోన్మాద ఫాసిజాన్ని పెంచిపోషిస్తున్న మోదీ-ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్‌ల కుట్రపూరిత విధానాలను నేటి విద్యార్థులు ప్రతిఘటించాల్సిన బాధ్యత ఉందన్నారు.
రాష్ట్ర నాయకుడు బి.అజయ్, కేయూ అధ్యక్షుడు బి.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వి.కావ్య, ఉపాధ్యక్షుడు పి.అనూష, గణేష్, సహాయ కార్యదర్శి యాదగిరి, పృథ్వీరాజ్, సాధన, కోశాధికారి సంగీత, నాయకులు అనిల్, రాజ్‌కుమార్, శ్రీకాంత్, చారి, వంశీ, వినయ్, శ్రీజ, రచన, సౌమ్య, భార్గవి పాల్గొన్నారు.