ములుగు : ములుగు జిల్లాలో (Mulugu Encounter) ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్లో (Encounter) మరో ముగ్గురు మావోయిస్టుల (Maoists ) పేర్లను గుర్తించాల్సి ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ (SP Sabarish) తెలిపారు. ఇటీవల జిల్లాలోని పెనుగోలు కాలనీలో ఇద్దరు అమాయక ఆదివాసులు ఊయకే రమేష్, ఊయకే అర్జున్లను మావోయిస్టులు హత్య చేశారని ఒక ప్రకనటలో తెలిపారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పూలకొమ్మ అటవిప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా నిషేదిత మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరిపారని వివరించారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరినప్పటికీ కాల్పులు జరుపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో 7గురు సీపీఐ మావోయిస్టులు మృతి చెందారని వివరించారు.
ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, ఏటూరునాగారం మహదేశ్పూర్ కార్యదర్శి ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23) మృతి చెందారని తెలిపారు. మరో ముగ్గురు పార్టీ సభ్యులను గుర్తించాల్సి ఉందని వెల్లడించారు.
ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్, పెద్ద మొత్తం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలం నుంచి పారిపోయిన మిగతా మావోయిస్టు సభ్యులు లొంగితే ప్రభుత్వం నుంచి పునరావాసం కల్పించి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఘటనై ఏటూరునాగారం (Ethurunagaram police) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. 14 ఏండ్ల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది అతిపెద్ద ఎన్కౌంటర్ కావడం విశేషం.