WI vs SA : తొలి పొట్టి ప్రపంచకప్ వేటలో దక్షిణాఫ్రికా (South Africa) అజేయంగా దూసుకెళ్తోంది. సూపర్ 8 తొలిపోరులో భారత జట్టును 76 పరుగులతో చిత్తుచేసిన సఫారీ టీమ్.. పటిష్టమైన వెస్టిండీస్‌ను అలవోకగా మట్టికరిపించింది. అదిరే ఆటతో ప్రత్యర్ధిని కట్టడి చేసిన ప్రొటీస్ జట్టు.. 177 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌మనిపించింది. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(82 నాటౌట్), క్వింటన్ డికాక్(47) మంచుముక్కలా కరిగించారు. డికాక్ ఔటయ్యాక.. రియాన్ రికెల్టన్(45 నాటౌట్) జతగా ప్రొటీస్ కెప్టెన్ లాంఛనం ముగించాడు. వరుసగా రెండు విజయాలతో మర్క్రమ్ సేన గ్రూప్ ఏలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
గతసీజన్ ఫైనలిస్ట్ దక్షిణాఫ్రికా పదో సీజన్లో రెచ్చిపోతోంది. లీగ్ దశను అజేయంగా ముగించిన ఆ జట్టు సూపర్ 8లోనూ పంజా విసురుతోంది. గురువారం వెస్టిండీస్ నిర్దేశించిన 177 పరుగుల భారీ ఛేదనను ఓపెనర్లు ఎడెన్ మర్క్రమ్(82 నాటౌట్), క్వింటన్ డికాక్(47), దూకుడుగా ఆరంభించారు. తొలి ఓవర్లోనే 6, 4తో రన్స్ పిండుకున్నారు. ఆ తర్వాత కూడా విధ్వంసక ఆటతో రెచ్చిపోయిన ఈ ద్వయం..పవర్ ప్లేలోనే 69 రన్స్ రాబట్టింది.
South Africa race to victory against West Indies and put one foot in the #T20WorldCup semi-finals!
Scorecard: https://t.co/YpyeGh9U0l pic.twitter.com/yIBjFs7p6E
— ESPNcricinfo (@ESPNcricinfo) February 26, 2026
ఆరంభంలో నెమ్మదిగా ఆడిన డికాక్ గేర్ మార్చి విజృంభించగా.. విండీస్ బౌలర్లు బిక్కమొహం వేశారు. తొలి వికెట్‌కు 95 రన్స్ జోడించిన ద్వయాన్ని ఎట్టకేలకు రోస్టన్ ఛేజ్ విడదీశాడు. డికాక్ ఔటైనా.. మర్క్రమ్ జోరు తగ్గించలేదు. అప్పటికే డికాక్ చేయాల్సిన నష్టం చేయగా.. రియాన్ రికెల్టన్(45 నాటౌట్) జతగా సఫారీ సారథి చెలరేగాడు. ఛేజ్ వేసిన 14వ ఓవర్లో మర్క్రమ్ రెండు.. రియాన్ ఒక సిక్సర్ బాదగా స్కోర్ 150 దాటింది. జేసన్ హోల్డర్ వేసిన తొలి బంతినే స్ట్రెయిట్ బౌండరీకి తరలించాడు. దాంత.. 9 వికెట్ల తేడాతో ప్రొటీస్ జట్టు జయకేతనం ఎగురవేసి సెమీస్ బెర్తుకు చేరువైంది. చిత్తుగా ఓడిన విండీస్ రన్‌రేటు +5 నుంచి +1.791కు పడిపోయింది. తద్వారా భారత జట్టు సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి.
సూపర్ 8 ఆరంభ మ్యాచ్‌లో భారీ విజయంతో హెచ్చరికలు పంపిన వెస్టిండీస్.. రెండో మ్యాచ్‌లో తడబడినా.. నిలబడింది. నరేంద్ర మోడీ స్టేడియంలో పవర్ ప్లేలోనే దక్షిణాఫ్రికా బౌలర్లు వికెట్ల వేటతో పైచేయి సాధించినా.. ఆఖరి పంచ్ మాత్రం విండీస్ హిట్టర్లదే.
What a partnership!
Jason Holder and Romario Shepherd put on a world-record 89-run stand for the eighth wicket to rescue West Indies from 83/7 to set South Africa 177 to win 👀
Follow the chase: https://t.co/WYqurb3KGW pic.twitter.com/vCtmqAQ4O3
— ESPNcricinfo (@ESPNcricinfo) February 26, 2026
కగిసో రబడ(2-22) లుంగి ఎంగడి(3-30)ల విజృంభణతో 83కే ఏడు కీలక వికెట్లు కోల్పోయిన కరీబియన్ జట్టు అనూహ్యంగా.. 170 ప్లస్ కొట్టింది.. మరో 30 పరుగుల్లోపే కుప్పకూలుతుందనుకున్న వేళ.. జేసన్ హోల్డర్(49), రొమారియో షెపర్డ్(52 నాటౌట్)లు అసమాన ఆటతో సఫారీ బౌలర్లను బెంబేలెత్తించారు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిన ఈ ద్వయం.. ఎనిమిదో వికెట్‌కు 89 రన్స్ జోడించి భారీ స్కోరందించారు.