చౌటుప్పల్, ఫిబ్రవరి 26 : మానవ శరీరంలో అత్యంత సున్నితమైన, విలువైన అవయవాలలో కండ్లు ఒకటని, స్పష్ట మైన చూపు లేకపోతే జీవితంలో అనేక పనులు కష్టతరంగా మారుతాయని లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా చౌటుప్పల్ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథం అన్నారు. చౌటుప్పల్ పురపాలిక కేంద్రంలోని వలిగొండ రోడ్డు సమీపంలో డత లయన్స్ క్లబ్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు, మధుమేహ, రక్తపోటు పరీక్షలను నిర్వహించారు. కంటి వైద్య నిపుణురాలు గుంటోజు సంధ్యారాణి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. పుర ప్రజలు పలువురికి కూడా మధుమేహ రక్తపోటు పరీక్షలు జరిపి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. ప్రతినిత్యం ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ విజయమోహన్, లైయన్స్ క్లబ్ ఆఫ్ సేవా కార్యదర్శి అతహర్ పాషా, సభ్యులు కాసుల వెంకటేశం, కటికం ప్రశాంత్, కొసనం రామిరెడ్డి పాల్గొన్నారు.