ములుగు: తెలంగాణ వచ్చిన తర్వాతనే మేడారం జాతరకు అత్యంత గౌరవం దక్కిందని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మేడారం జాతర కోసం ప్రభుత్వం రూ.332 కోట్లతో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించిందని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
మేడారం జాతర నిర్వహణపై ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. అంతకుముందు మంత్రులు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జాతర ప్రాంగణం వద్ద ప్రారంభించారు.
దక్షిణాదిలోనే అతిపెద్ద కుంభమేళాను తలపించేలా గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం గిరిజన జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు మంత్రులు వెల్లడించారు.
ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మేడారానికి వచ్చే ప్రతి సామాన్య భక్తుడికి సమ్మక్క-సారలమ్మ ఆశీస్సులు పొందేలా అన్ని ఏర్పాట్లను సీఎం కేసీఆర్ చేయించారని ఫిబ్రవరి 18 న సీఎం కేసీఆర్ మేడారానికి విచ్చేసి సమ్మక్కను దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పంచాయతీరాజ్ శాఖ ద్వారా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టి.. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి.. అన్ని సౌకర్యాలతో జాతర నిర్వహిస్తామని తెలిపారు. జాతర సమీపిస్తున్న కొద్దీ.. ఒమిక్రాన్ భయంతో జాతర నిర్వహిస్తారో లేదో అనే సందిగ్ధంలో భక్తులు ఉన్నారని.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని.. ఆయన ఆదేశాల మేరకే తాము ఇక్కడికి రావడం జరిగిందన్నారు.