ఖిలావరంగల్ : వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ భూములకు పట్టాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతి పత్రం సమర్పించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో ఉన్న గొర్రెకుంట గ్రామంలో సుమారు 80 శాతం మంది రైతులకు భూములపై రికార్డులు, పట్టాలు లేవని వారు తెలిపారు. తాము తండ్రులు, తాతల కాలం నుంచే ఈ భూములను సాగు చేస్తూ వ్యవసాయాన్ని జీవనాధారంగా కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటివరకు పట్టాలు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్వం ఇనాం, వారసత్వ భూములు, సాదా కాగితాలపై కొనుగోలు చేసిన భూములే ఎక్కువగా ఉండటంతో అధికారిక రికార్డులు లేకపోయాయని రైతులు వివరించారు. నగర పరిధిలో విలీనం కాకముందు కొంతమంది రైతులు మండల అధికారులకు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. అనంతరం ప్రభుత్వం సాదా బైనామాలకు అవకాశం కల్పించడంతో గ్రామ రైతులందరూ మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు.
అయితే గ్రామం జీడబ్ల్యూఎంసీ పరిధిలోకి రావడంతో ఈ ప్రక్రియను నిలిపివేశారని తెలిపారు.
పట్టాలు లేకపోవడంతో భూములను వారసులకు బదిలీ (విరాసత్) చేయడం కూడా సాధ్యం కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కాబట్టి గ్రామంలో పూర్తి విచారణ జరిపి, పక్క రైతుల వాంగ్మూలాలు తీసుకుని తగిన చర్యలు తీసుకొని పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని రైతులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. విలీన గ్రామాల రైతుల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించి తగిన న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.