ములుగు, మే 31: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి రోజు రోజుకు భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అందుకు అనుగుణంగా విస్తృత ప్రచారం కల్పించేలా, రామప్ప రూట్‌ను తెలియజేసేలా ములుగు (Mulugu) జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జాతీయ రహదారి 163 మీదుగా రామప్పకు వెళ్లే క్రమంలో ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న మూడు ట్రాఫిక్ ఐలాండ్లలో రామప్ప దేవాలయ విశిష్టత తెలియజేసే విధంగా మూడు థీమ్‌లను ఏర్పాటు చేస్తుండగా ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఒక ఐలాండ్‌లో భక్తులకు స్వాగతం పలికేలా ఏనుగు విగ్రహాలతో పాటు నంది విగ్రహాన్ని, మరో దానిలో రామప్ప గుడిలోని శిలాశాసన మందిరాన్ని పోలిన నిర్మాణంతో పాటు చుట్టూ నాట్య భంగిమల విగ్రహాలు, ఇంకో దానిలో చేతిలో డమరుకంతో పాటు రెండు వైపులా నంది విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. త్వరలో ఈ పనులు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే పర్యాట కులకు ఆధ్యాత్మికత పంచుతూ రూట్ మ్యాప్స్ గా మారనుంది.