తాడ్వాయి, ఫిబ్రవరి13: వరాలిచ్చే దేవతలు, ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారలమ్మను భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందుతున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మలకు పూజలు చేసి దీవెనలు పొందుతున్నారు. పిల్లాపాపలు సల్లంగా ఉండాలని.. సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో పలు జిల్లాల నుంచే కాక ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులతో మేడారం పోటెత్తింది. అమ్మవార్ల దర్శనానికి క్యూలు కట్టారు. దీంతో జాతర పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వనదేవతల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టినా ఓపికగా తల్లులను దర్శించుకున్నారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం యాటపోతులు, కోళ్లు సమర్పించి గద్దెల పరిసరాలతోపాటు చిలకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో విడిది చేసి వంటలు వండుకుని విందు భోజనాలు చేసి తిరుగు ప్రయాణమవుతున్నారు. భక్తులు సమీప అటవీ ప్రాంతాల్లో విడిది చేయడంతో వనమంతా జనంతో నిండిపోయింది
తల్లులంటే ఎంత భక్తో..!
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ప్రతీది ప్రత్యేకమే. ఆదివారం జగిత్యాల నుంచి తల్లితో కలిసి జాతరకు వచ్చిన ఓ చిన్నారి తల్లులను మొక్కేందుకు తెగ ఆరాటపడింది. గద్దెల సమీపంలో ఓ చెట్టు వద్ద పసుపు, కుంకుమతో పూజలు చేయగా తల్లులను తాకి, బొట్టు తీసుకుంటూ కనిపించింది.
అమ్మా.. ఆక్సిజన్ అందుతోందా?
ఆదివారం జాతరకు వచ్చిన ఓ భక్తురాలు క్యూలైన్లో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. ఇంతలో రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందడంతో క్షణాల్లో మెడికల్ కిట్‌తో అక్కడికి చేరుకున్నారు. ఆంబూ ద్వారా కృత్రిమ శ్వాస అందించడంతో ఆమె ఆరోగ్యం కుదుటపడింది.
మీ వాళ్లు ఇక్కడే ఉన్నారు?
‘మీ వాళ్లు ఇక్కడే ఉన్నారు.. మీరు ఎక్కడున్నా రావాలంటూ’ మంత్రి సత్యవతిరాథోడ్ అనౌన్స్మెంట్ చేస్తూ కనిపించారు. మేడారం పర్యటనలో భాగంగా ఆదివారం భక్తులకు అందుతున్న సౌకర్యాలు ఆరా తీసి పనిలో పనిగా గద్దెల ప్రాంగణంలో ఉన్న మంచెపైకి వచ్చారు. ఆ సమయంలో ఓ భక్తురాలు తప్పిపోయినట్లు తెలుసుకొని మైక్ అందుకొని తానే స్వయంగా ఆమె బంధువులకు కబురుచేశారు.
బస్సుల ద్వారా 21 లక్షల మందిని చేరవేస్తాం: ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్
మహాజాతర సందర్భంగా ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు 3,845 బస్సులను 21లక్షల మంది భక్తులను మేడారం చేరవేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మేడారం జాతరలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్ల పర్యవేక్షణలో అద్భుతంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌లో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసి సాంస్కృతిక కళాకారులతో కళా ప్రదర్శనలు సైతం ఏర్పాటు చేశామని అన్నారు. గత జాతర కంటే ఏర్పాట్లను మెరుగుపర్చినట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే నేరుగా గద్దెల సమీపంలో దిగొచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్, ఏఎస్పీ ఎస్ఆర్ కేకన్, ఆర్టీసీ ఈడీ యాదగిరి, పౌర సంబంధాల శాఖ ఏడీ లక్ష్మణ్ పాల్గొన్నారు.