ములుగురూరల్ : అభివృద్ధిలో ములుగు జిల్లాను పరుగులు పెట్టిస్తున్న జిల్లా అధికారుల సేవలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ రైజింగ్ 2047విజన్ పేరుతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద పేదలకు పనిదినాలు కల్పించడం, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఈ నెల నుంచి ఆగస్టు నెల వరకు మూడు నెలల సరిపడ బియ్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు.
నిరుపేదల సొంతింటి కళ సాకారం చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చురుగ్గా కొనసాగుతుందని అన్నారు. మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడంతో 33 దేశాల సుందరీమణులు రామప్ప శిల్ప కళకు ఫిదా అయ్యారని తెలిపారు. పర్యాటక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ములుగు జిల్లాను అభివృద్ది చేయడం జరుగుతుందని, దేశ విదేశీయులు ఆకట్టుకునే విధంగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని అన్నారు. అనంతరం మంత్రి సీతక్క 15మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, పది మంది లబ్ధిదారులకు భూ భారతి పట్టాలు, రైతులకు విత్తన కిట్లు, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, అదనపు ఎస్పీ సదానందం, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.