పేదలు, దళితులు, గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడే బీజేపీ ప్రభుత్వాన్ని అడ్రస్ లేకుండా చేయడం కోసం అన్ని వర్గాలు ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేంద్రం మెడలు వంచి మన డిమాండ్లను పరిష్కరించుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంపై, ముఖ్యంగా అన్నదాతలపై కేంద్రం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ గార్డెన్స్‌లో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ అధ్యక్షతన నిర్వహించిన ములుగు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి.. ఒకటే దేశం ఒకటే పాలసీ అన్నట్లు బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో పండిన పంటను అంతా ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలి. గిరిజనుల స్థితిగతులు చూసి జనభాకనుగుణంగా రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన ఉద్యమ నాయకులు కేసీఆర్, తెలంగాణ వచ్చాక రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతానని, రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2017లో పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారన్నారు.
చేనేతపై వేసిన జీఎస్టీ అదనపు 5 శాతం పన్ను రద్దు చేయాలి. ఎస్సీ వర్గీకరణ చేయాలి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో వచ్చిన రాష్ట్రంలో మొన్ననే 80,039 ఉద్యోగాలకు హామీ ఇచ్చి, నిన్న 31 వేల ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వగా, ఇక్కడి యువతకు మరిన్ని ఉద్యోగాలు రావడానికి కేంద్రంలో ఉన్న 15 లక్షల ఖాళీలను భర్తీ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. బీసీ జనగణన చేయాలి. విభజన చట్టంలోని హామీలు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని సత్యవతి డిమాండ్ చేశారు.