కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్ల నుంచి ఎక్కడి ఖాళీ స్థలం కనిపించినా కాజేస్తున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో భూములకు ధరలు అమాంతం పెరగడంతో కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ స్థలాలను కొల్లగొట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రజా పాలన పేరిట భూదోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ స్థలాలతో పాటు పేదల ఇండ్లను సైతం కూల్చి అభివృద్ధి పేరిట ప్రభుత్వ పెద్దల అనుకూల కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. కొండలు, గుట్టలు, చెరువులు, కుంటలను సైతం పెకిలించి ఇష్టానుసారం కబ్జాలకు పాల్పడుతున్నారు.
సిటీ బ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారమే పరమావధిగా కాంగ్రెస్ పాలన సాగుతున్నది. తాజాగా నాగర్ కర్నుల్ ఎంపీ మల్లు రవి సతీమణి డాక్టర్ రాజా బన్సీదేవి పేరిట నగరం నడిబొడ్డున ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని రాసిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. హిమాయత్‌నగర్ రెవెన్యూ పరిధిలోని హైదర్‌గూడ కేఫ్ బహర్ ఎదురుగా ఉన్న రూ.8 కోట్లకు పైగా విలువైన 233.73 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆమెకు రాసిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ మేరకు బదలాయింపు ప్రక్రియను వేగవంతం చేశారు. జనవరి 29న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం పూర్తి చేసి జిల్లా రెవెన్యూ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. జిల్లా రెవెన్యూ అధికారులు సైతం భూమిని గుర్తించి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. క్యాబినెట్ ఆమోదం పొందగానే భూమిని మల్లు రవి సతీమణి రాజా బన్సీదేవికి కేటాయించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.
15 ఏండ్ల కిందటి వినతి వెలికి తీసి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు గతంలో కన్నేసిన భూములను ధారాదత్తం చేసేందుకు పాత ఫైళ్లను తవ్వి తీస్తున్నారు. అందులో భాగంగానే ఎంపీ మల్లు రవి సతీమణి డాక్టర్ రాజా బన్సీదేవి పేరిట భూకేటాయింపునకు జీహెచ్ఎంసీకి చేసుకున్న దరఖాస్తును బయటకు తీశారు. హైదర్‌గూడలోని కేఫ్ బహర్ ఎదురుగా ఉన్న 233.73 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. అప్ప టి వినతిని ఈ ఏడాది జనవరి 29న స్టాండిం గ్ కమిటీ ముందు పెట్టి భూమిని కేటాయించేందుకు ఎన్వోసీ ఇస్తున్నట్లు తీర్మానించారు. రెవెన్యూ అధికారులు సైతం ఆ భూమి ఎలాం టి వివాదాల్లో లేదని తేల్చేసి ప్రభుత్వానికి నివేదించారు.
నగరం నడిబొడ్డున అత్యంత విలువైన భూమిని అధికార పార్టీ ఎంపీ, ఉపముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు రాసిచ్చేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. కేఫ్ బహర్ ఎదురుగా ఉన్న ఆ 233.73 గజాల భూమి వెనుక భాగంలో ఇప్పటికే మల్లు రవికి కొంత భూమి ఉన్నది. అందులో పాత నిర్మాణాలున్నాయి. ఈ 233.73 గజాల భూమికి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.8 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. వారి భూమిలో దీన్ని కలుపుకొంటే విలువ మ+రింత పెరగడంతో కమర్షియల్‌గా అభివృద్ధి చేసుకోవచ్చు. అందు లో భాగంగానే 15 ఏండ్ల కిందనే ప్రభుత్వ భూమిని కలుపుకొనేందుకు ప్రయత్నాలు చే శారు. ఇప్పుడు అధికారంలో ఉండటం కాం గ్రెస్ నేతలంతా భూములను ఫలహారంగా ప ంచుకుంటుండటంతో ‘మల్లు’ కుటుంబం సై తం రంగంలోకి దిగి ప్రభుత్వ భూములను ఇ ష్టానుసారం తమ పేరిట రాసుకునేందుకు తెర తీశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్కడ ఖరీదైన భూములు కనిపించినా కాంగ్రె స్ నేతలు కాజేస్తున్నారని మండిపడుతున్నారు.
పేదలను దోచి.. పెద్దలకు…
కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండున్నరేండ్ల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఇష్టానుసారం లాగేసుకుంటూ అరాచక పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే మూసీ పునరుజ్జీవం పేరిట పేద ప్రజల పట్టా భములు, ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కొల్లగొడుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఖాళీ స్థలాలు, కొండలు, గుట్టలను తమ పేరిట రాసుకుంటున్నారు. మరోవైపు హిల్ట్ పేరిట నగరంలోని పరిశ్రమలను తరలించి ఆ భూములను మింగేసేందుకు సిద్ధమవుతున్నారు. వీటన్నింటితో పాటు నగరంలోని ఖరీదైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పేరిట బదలాయింపు చేసుకునేందుకు అధికారికంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దల భూదోపిడీని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడ్తూ వేధింపులకు గురిచేస్తున్నారు.
ఇటీవల బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మల్లు రవికి భూకేటాయింపుపై కాంగ్రెస్ తీరును ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారం తమ నేతలకు భూములను రాసిస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై మల్లు రవి స్పందిస్తూ తమ కుటుంబానికి ఎలాంటి భూకేటాయింపులు చేయడం లేదని.. ఆయనపై ఆరోపణలు చేసినందుకు పరునష్టం దావా వేస్తామని వ్యాఖ్యానించారు. అటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులేమో మల్లు రవి సతీమణి పేరిట భూమిని కేటాయించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే.. ఆయన అలా మాట్లాడటంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు సోషల్‌మీడియాలోనూ ఆయనకు కేటాయించేందుకు విడుదల చేసిన సర్యులర్తో పాటు భూమికి సంబంధించిన ఫొటోలను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ భూదోపిడీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.