సిటీబ్యూరో: తప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్ల ద్వారా పెట్టుబడిదారులను మోసం చేశారనే కేసులో త్రిపుర కన్స్ట్రక్షన్స్ సంస్థ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్, ఆయన భార్య సుగుణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేటకు చెందిన వినోద్సాదక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతనెల 27న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంస్థకు చెందిన శివకృష్ణ, పల్లవీకృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెల్లాపూర్‌లోని త్రిపుర నిర్వాణ పేరుతో నిర్మిస్తామంటూ చెప్పిన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో 2200 చదరపు అడుగుల ఫ్లాట్ కోసం రూ.77 లక్షలు చెల్లించామని వినోద్ సాదక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫ్లాట్ కానీ, డబ్బులు కానీ రాకపోవడంతో మరోవైపు బీహెచ్ఈఎల్ ఉద్యోగి కోత మహేశ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం సంస్థకు సంబంధించి తెల్లాపూర్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత ఆయనతో సహా తొమ్మిది మంది రూ.4.41 కోట్లు నష్టపోయారని తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం త్రిపుర కన్స్ట్రక్షన్ సంస్థ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసింది. ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చింది.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రిపుర కంపెనీ ముందుగా ఫ్రీ లాంచ్ పేరుతో పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చి, అడ్వాన్స్ పేరుతో భారీ మొత్తాలు తీసుకుంది. అనంతరం నిర్మాణం త్వరలో పూర్తవుతుందని చెబుతూ సంవత్సరాల పాటు వేచి ఉండమని చెప్పింది. ఈ ప్రకటనలను నమ్మి చాలామంది ప్రజలు కోట్ల రూపాయలు పెట్టుబడిగా చెల్లించారు. కానీ గడువు దాటినా ప్లాట్లు ఇవ్వలేదు. అదే సమయంలో డబ్బులు తిరిగి కోరిన వారికి కూడా సరైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన పోలీసులు, భారీ స్థాయిలో డబ్బులు సేకరించినట్లు గుర్తించారు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన పనులు జరగలేదని, అయినప్పటికీ కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రచారం కొనసాగించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పసుపులేటి సుధాకర్, ఆయన భార్య సుగుణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న సుధాకర్ కుమార్తె ,అల్లుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. త్రిపుర కన్స్ట్రక్షన్స్ కేసు విచారణ జరుగుతున్నదని, దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని సీసీఎస్ పోలీసులు తెలిపారు.