ఇందిరమ్మ ఇళ్ల గిరిజన లబ్ధిదారులపై కాంగ్రెస్ నేతలు కక్ష కట్టారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారన్న అనుమానంతో ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. వారి ఇండ్లు కట్టొదంటూ తాపీమేస్త్రీలకు హుకుం జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటువేసి తప్పు చేసినట్లు వారి ఎదుట ఒప్పుకుంటేనే ఇళ్లు పూర్తి అవుతాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఐటీడీఏ పీవోను కలిసి తమ గోడును వెల్లబోసుకుంటామని చెబుతున్నారు.
అశ్వారావుపేట, మార్చి 4 ; రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తామని ఆర్భాటంగా ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. సుమారు 5 నెలల కిత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో మంజూరైన ఇళ్లను పూర్తి చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు. అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులను రాజకీయ దృష్టితో వేధిస్తున్నారు.
గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేశారన్న అనుమానంతో గ్రామానికి చెందిన కోడె చిలకమ్మ, మడకం స్వాతితోపాటు మరో మహిళ ఇళ్ల నిర్మాణాలను స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. వారి ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయవద్దంటూ మేస్త్రీలను బెదిరిస్తున్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసి తప్పు చేశామని వారి ఎదుట ఒప్పుకొని క్షమాపణలు చెబితేనే నిర్మాణాలు పూర్తి చేస్తామంటూ సదరు లబ్ధిదారులకు మేస్త్రీల ద్వారా హెచ్చరికలు జారీచేశారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతూ తలలు పట్టుకుంటున్నారు. ముగ్గురు మహిళల్లో ఒకరు అక్కడ కాంగ్రెస్ నేతలను కలవడంతో ఆమె నిర్మాణం కొనసాగింపునకు అభయమిచ్చారు. మిగతా చిలకమ్మ, స్వాతిల ఇళ్లు కట్టొద్దని మేస్త్రీలకు హుకుం జారీ చేశారు. దీంతో మేస్త్రీలు ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలేశారు. సుమారు మూడు నెలలుగా గిరిజన లబ్ధిదారులను వేధింపులకు గురిచేస్తున్నారు.
కాంగ్రెస్ మేస్త్రీలకే పనులు?
సొంతంగా తమకు నచ్చిన మేస్త్రీలతో ఇళ్లు నిర్మించుకుంటామని లబ్ధిదారులు ప్రాథేయపడినా కాంగ్రెస్ నాయకులు వినలేదు. వారు చెప్పిన మేస్త్రీలకే ఇంటి నిర్మాణ పనులు అప్పగించాలని, లేకుంటే బిల్లులు రావంటూ బెదిరించారు. దీంతో గత్యంతరం లేక కాంగ్రెస్ నేతలు చెప్పిన మేస్త్రీలకే నిర్మాణ పనులు అప్పగించి అడిగినంత చెల్లించుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలతోపాటు ఒక్కో ఇంటికి అదనంగా రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఇంటి నిర్మాణ పనులకు మేస్త్రీలు వసూలు చేస్తున్నారు. అయినా నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. నెలల తరబడి నిర్మాణాలు కొనసాగిస్తూ లబ్ధిదారుల అసహనాన్ని పరీక్షిస్తున్నారు. అధికారులు కూడా కాంగ్రెస్ నేతల హెచ్చరికలకు బెదిరిపోతున్నారు. లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక మనోవేదనకు గురవుతున్నారు. లబ్ధిదారులు, కాంగ్రెస్ నేతల మధ్య అధికారులు నలిగిపోతున్నారు.
బీఆర్ఎస్కు ఓటు వేశామని అనుమానం
గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేశామని కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. ఓటు వేసినందుకు క్షమాపణలు చెప్పాలని, అప్పటివరకు ఇంటి నిర్మాణం ఉండదని మేస్త్రీల ద్వారా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతోపాటు అదనంగా రూ.1.40 లక్షలకు ఇల్లు నిర్మించి ఇచ్చేటట్టు తాపీమేస్త్రీ ఒప్పందం చేసుకున్నాడు. మొదటివిడతగా రూ.50 వేలు ఇచ్చాను. బేస్మెంట్ బిల్లు రూ.లక్ష కూడా మేస్త్రీ తీసుకున్నాడు. పనులు చేయమంటే కాంగ్రెస్ నేతలు వద్దని ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నాడు. అధికారులు కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సరైన సమాధానం కూడా చెప్పటం లేదు.
– మడకం స్వాతి, లబ్ధిదారురాలు, కొత్తూరు
క్షమాపణలు చెప్పేవరకు పనులు చేయరట..
బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయలేదని రుజువు చేసుకొని క్షమాపణలు చెప్పేవరకు పనులు చేయమని మేస్త్రీ చెబుతున్నాడు. పనులు చేస్తే బిల్లులు రాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటారని భయపడుతున్నాడు. వాళ్లు చెప్పిన తాపీమేస్త్రీకి ఇంటి నిర్మాణం ఇవ్వకుంటే బిల్లులు రాకుండా అడ్డుకుంటామని బెదిరించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.ఐదు లక్షలతోపాటు అదనంగా రూ.1.20 లక్షలకు ఇంటి నిర్మాణం పూర్తిచేసేందుకు తాపీమేస్త్రీ ఒప్పుకున్నాడు. ఇప్పటికే రూ.40 వేలు చెల్లించాను. పంచాయతీ ఎన్నికల తర్వాత నుంచి ఇంటినిర్మాణం నిలిపివేశాడు. ఐటీడీఏ పీవో వద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకుంటాం. – కోడె చిలకమ్మ, లబ్ధిదారురాలు, కొత్తూరు
చెప్పినా వినడం లేదు
సమస్య నా దృష్టికి వచ్చింది. రాజకీయాలతో సంబంధం లేదు. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని మేస్త్రీలకు చెబుతున్నా వినడం లేదు. ఈ విషయాన్ని హౌసింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాను.
– బాబు, పంచాయతీ కార్యదర్శి
నిర్మాణాలు ఆపితే కుదరదు..
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలతో రాజకీయాలకు సంబంధం లేదు. మంజూరైన ప్రతి ఇంటి నిర్మాణం పూర్తి చేయాల్సిందే. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకుంటాను. వినకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.
– మదన్‌కుమార్, హౌసింగ్ ఏఈ, అశ్వారావుపేట