ములుగు : వడగండ్ల వానతో పంట నష్టపోవడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం మల్లూరు పంచాయతీ పరిధి, మొట్లగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన యాలం నరసింహారావు అనే రైతు ఈ నెల 7న కురిసిన వడగండ్ల వానకు వరి, మిర్చి పంటలు దెబ్బ తినడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబ సభ్యులు ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ములుగు జిల్లా కేంద్రంలోని హాస్పిటల్కు తరలించారు. నరసింహారావు తనకున్న 5 ఎకరాల పొలానికి తోడు మరో 14 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. 14 ఎకరాల్లో వరి, 5 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. ఇటీవల కురిసిన వడగండ్ల ధాటికి చేతికి అందిన పంట పూర్తిగా నేలపాలు కావడంతో ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.