Warangal | నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 29: ఆకాశం కోతకు గురైనట్టు.. సముద్రం కట్టలు తెగినట్టు.. మొంథా తుపాను (Cyclone Montha) ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాను ముంచెత్తింది. భారీ, అతిభారీ అనే కొలమానికాన్ని మింగేసింది. తన తీవ్రతలో కొట్టుకుపోయేలా చేసింది. కాళేశ్వరం, మహదేవ్పూర్, ఏటూరునాగారం, మంగపేట మీదుగా పరుగులెత్తే గోదావరి ఉన్నఫళంగా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల వైపు మళ్లిందా? అని ఆశ్చర్యపడేలా చేసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కుండపోత వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. మొంథా తీవ్రతను మధ్యాహ్నం గుర్తించిన అధికార యంత్రాంగం హుటాహుటిన విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. సర్కారు బడుల పిల్లలను వదిలిపెట్టగా.. అదే ప్రైవేట్ యంత్రాంగం మిన్నకుండిపోయింది. ఫలితంగా వరంగల్, హన్మకొండ పట్టణాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సాయంత్రం 4 నుంచి రాత్రి పది గంటల వరకు వరద పోరాటం చేసి తమ పిల్లలను ఇంటికి తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా 41.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కల్లెడ, ఉర్సు, రెడ్లవాడ, ధర్మసాగర్, కాపులకనపర్తి, వర్ధన్నపేటల్లో 30 సెంటీ మీటర్లకుపైగా వాన కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. వాగులు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు పడుతున్నాయి. రోడ్లపైకి భారీగా వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలించారు. పంటలకు సైతం కోలుకోలేని నష్టం జరిగింది. చేతికొచ్చిన వరి పంట నేలవాలగా.. ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి చెట్లపైనే తడిసి ముద్దయ్యింది. మార్కెట్లు, కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం, మక్కజొన్న తడిసిపోయింది.
వరి, పత్తి, మిర్చి చేనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. డోర్నకల్, వరంగల్ రైల్వే స్టేషన్లలో పట్టాలపైకి నీళ్లు చేరడంతో పలు రైళ్లను నిలిపివేశారు. రైళ్ల ఆలస్యం, దారి మళ్లించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కాగా, హనుమకొండ, వరంగల్ నగరాన్ని వర్షం ముంచెత్తడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలాశయాలుగా మారాయి. ఎటు చూసినా డ్రైనేజీలు, కాల్వలు నిండి పొంగిపొర్లాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. హనుమకొండలోని వివిధ ప్రాంతాల్లో నీట మునిగిన సుమారు 250 మందిని పోలీసులు, అధికారులు అంబేద్కర్ భవన్‌కు తరలించారు.
జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్) ఎదురుగా ఉన్న రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో చిన్నారులు చిక్కుకోగా డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్ వారిని రక్షించారు. చాలా చోట్ల ఇండ్లలో కి వర్షపు నీరు చేరడంతో నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. అండర్ బ్రిడ్జి రోడ్డు, వరంగల్ చౌరస్తా, పాత బీటుజార్లోని ప్రధాన రహదారులపై వరద నీరు భారీగా ప్రవహించింది. హంటర్‌రోడ్డులోని బొందివాగు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎంజీఎం దవాఖాన మెడికల్ రికార్డు డిపార్టుమెంట్ (ఎంఆర్డీ), మెడికల్ వార్డులోకి వరద నీరు చేరింది. ఖానాపురం మండలంలోని మనుబోతులగడ్డ గ్రామంలో ఇల్లు కూలగా, ఆ సమయంలో ఎవరూ అక్కడ ఉండకపోవడంతో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లాలో వర్షం దంచి కొట్టింది.
డోర్నకల్ రైల్వే స్టేషన్లో ట్రాక్‌లు మునిగిపోవడంతో గోల్కొండ, గూడ్స్ రైళ్లను నిలిపివేశారు. దీంతో ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో అల్పాహారం, వాటర్ బాటిల్స్ అందజేశారు. గూడూరు మండలం భీమునిపాదం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పర్యాటకులను అనుమతించలేదు. నెల్లికుదురు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై పార్వతమ్మగూడెం వద్ద భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్తున్న 2 అంబులెన్స్ వాహనాలు (108) నిలిచిపోయాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది వెంటనే గొడ్డలితో చెట్టు కొమ్మలను తొలగించి భాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, గురువారం విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు.