జనగామ, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నది.. అన్నింటిని పింక్‌బుక్‌లో రాస్తున్నాం.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింతా తిరిగి చెల్లిస్తాం.. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు.. మీ లెక్కల న్నీ బయటకు తీస్తాం.. జాగ్రత్త’ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. గురువారం జనగామ జిల్లాకు వచ్చిన ఆమె తొలుత పెంబర్తి విశ్వకర్మ హస్తకళల కేంద్రాన్ని సందర్శించి బ్రాస్ సొసైటీ ప్రతినిధులు హస్త కళాకారుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
అదే గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త రేఖరాజ్ ను పరామర్శించి, అంబేద్కర్, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాలకు నివాళులర్పించారు. అక్కడి నుం చి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి కవిత చేరుకోగా, మున్సిపల్ మాజీ చైర్మన్ పోకల జమున, బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రేమలతారెడ్డి, అనిత, స్వరూప, సుధ, చెంచారపు పల్లవి, శారదతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం యశ్వంతాపూర్‌లోని జి ల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, సీనియర్ నాయకుడు క్యామ మల్లే శం, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, ఇర్రి రమణారెడ్డి, గద్దల నర్సింగరావు, కందుకూరి ప్రభాకర్, వై కుమార్‌గౌడ్ తదితరులతో కలిసి ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారని.. పోస్టు చేసిన మరునాడే పోలీసులు ఇంటికి వచ్చి వేధిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. రైతు డిక్లరేషన్‌పై నిలదీస్తారని రాహుల్‌గాం ధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని, రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని ఆయన తిరుగుతుంటే.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి మాత్రం దానిని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దగా, మోసం అని.. ఇస్తామన్న రూ. 2,500, సూటీలు ఇవ్వకుండా మహిళలను వేధిస్తున్నదన్నా రు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు మాయమయ్యాయన్నారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందేనని.. మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను మోసం చేసిందని మండిపడ్డారు. విదేశీ విద్య సాలర్షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భా గ్య పరిస్థితి ఉందని, ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నదని, రైతు భ రోసా పేరిట రైతులను మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. రుణమాఫీ పూర్తయిందని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెబుతున్నారని, సంక్రాంతి నుంచి ఇస్తామన్న సన్న బియ్యం ఇంకా ఇవ్వలేదని, కాంగ్రెస్ అబద్ధాలను ఎండగడతామని స్పష్టం చేసిన కవిత మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే ఊరుకోమని.. విద్య, ఉద్యోగాల్లో 46 శాతం చొప్పున, రాజకీయ రం గంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాం డ్ చేశారు. బీఆర్ఎస్ ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడతామని ప్రకటించిందని, ఇది బీసీలందరి విజయమని వ్యాఖ్యానించారు. మళ్లీ కుల సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, అయితే నెల రోజుల సమయం ఇవ్వాలని కోరారు. రీ-సర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసి, టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటు లో ఉంచాలన్నారు. అసెంబ్లీ వద్ద అంబేదర్ విగ్రహాన్ని పెట్టాలని జాగృతి పదేళ్ల ముందే డిమాండ్ చేసిందని ఆమె గుర్తు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పట్టుబట్టి సమ్మక-సారక బరాజ్ పనులను 95 శాతం పూర్తి చేయిస్తే, ఏడాదైనా మిగిలిన 5 శాతం పూర్తి చేయలేని అసమర్థ, చేతగాని, దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులకు నష్టం జరుగుతున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001లో ఆగమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేసినా కేసీఆర్ వచ్చాక పనులు పూర్తిచేసి గ్రామాలకు నీళ్లు పారించారని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించే అంశంపై గతంలో ఇరిగేషన్‌శాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదన్నారు. అవకాశవాదం కోసం పార్టీ మారిన కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదని, ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని, అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. సమావేశంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పసునూరి మురళి తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధి బీఆర్ఎస్ చలువేనని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నా రు. గతంలో మంజూరైన కోట్లాది రూపాయల పను లే ఇప్పుడు చేస్తున్నారని, ఇప్పటికీ ఒక్క పైసా తేలేదన్నారు. సమ్మక్క-సారలమ్మ బరాజ్ నిర్మించి 365 రోజులు నీళ్లుండేలా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నా రు. తొమ్మిది రిజర్వాయర్ల ద్వారా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ప్రాజెక్టుల హబ్‌గా, ఇరిగేషన్లో జనగామ నంబర్ వన్‌గా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం రైతులకిచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదని, భరోసా గందరగోళంగా మారిందన్నారు. 420 మంది రైతుల ఆత్మహత్యలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కారణమైందన్నారు. అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభు త్వం విఫలమైందని, దీనిని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించిన మనోజ్‌రెడ్డిని తప్పుడు కేసులతో జైలు పాలు చేశారని ఆరోపించారు. కడియం శ్రీహరికి ఏ మాత్రం నైతిక విలువలున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ చేశారు. తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కేసీఆర్‌ను నమ్మించి మోసం చేశారని, తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఆయనను ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు.