మహబూబాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ) : ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న మానుకోట ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దకుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చేసిందేమీ లేదని ఆమె విమర్శించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానుకోటలో ఒక మున్సిపాలిటీ ఉంటే అదనంగా మూడు మున్సిపాలిటీలు చేసి ఒకో మున్సిపాలిటీకి రూ.25 కోట్ల చొప్పున ఇచ్చి అభివృద్ధి చేశారని, కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన నిధులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.
జిల్లాలో చాలా పనులు 90శాతం పూర్తయ్యాయని, కేవలం 10శాతం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తే మొత్తం పనులు పూర్తయితాయని తెలిపారు. కానీ నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపించారు. జిల్లాలో రైతులకు రుణమాఫీ కాక.. రైతు భరోసా అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది రైతులకు చనిపోయిన తర్వాత వచ్చే రైతు బీమా డబ్బులు కూడా అందడం లేదని మండిపడ్డారు. మానుకోట గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతమని అందరూ వ్యవసాయాన్నే నమ్ముకొని బతుకుతారని వారిపై రేవంత్ సర్కారుకు కనీస కనికరం లేకుండా పోయిందన్నారు. మిర్చి, పసుపు రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు.
రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మనసు ఎలా వచ్చిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రి, అధికారులతో భేటీ అయి మిర్చికి మద్దతు ధర తీసుకొచ్చాడని, అదే తరహాలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా తేవాలని ఆమె డిమాండ్ చేశారు. తొర్రూరు, మరిపెడలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు అతీగతీ లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఒక ఇటుక రాయి కూడా వేయలేదన్నారు.గతేడాది ఆగస్టు నెలలో భారీ వర్షాలకు పంటలు కొట్టుకుపోయి, ఇసుక మేటలు వేసి రైతుల చాలా నష్టపోయారని.. తెగిపోయిన చెరువులు, కొట్టుకుపోయిన రోడ్ల కోసం ఇప్పటివరకు నిధులు కేటాయించి ఎందుకు బాగుచేయలేదని ప్రశ్నించారు.
మరిపెడ మండలం సీతారాంతండాలో పట్టుమని 25 ఇల్లు కూడా లేవని, అకడ మొత్తం మునిగిపోయి వస్తు సామగ్రి అంతా కొట్టుకపోతే సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి పరామర్శించాడే తప్ప ఒక రూపాయి సాయం కూడా చేయలేదని విమర్శించారు. వరద బాధితులకు ఆ రోజున బీఆర్ఎస్ నాయకులే అండగా నిలిచారని గుర్తుచేశారు. పేదలకు ఎప్పుడు కష్టం వచ్చినా వారికి అండగా నిలిచేది గులాబీ జెండాయేనని ఇప్పటికైనా కాంగ్రెస్ గుర్తు పెట్టుకోవాలన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మెల్సీ స్పష్టంచేశారు.
కాంగ్రెస్ పాలనలో మా బతుకులు ఆగమైనయ్..
మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 24 : రేవంత్‌రెడ్డి పాలన వచ్చినప్పటి నుంచి మా ఆటోడ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని మా పక్షాన ప్రభుత్వంతో కొట్లాడి న్యాయం జరిగేలా చూడాలని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు నలమాల సాయి కోరారు. అన్నారు. సోమవారం మహబూబాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను కలిసి ఆటోడ్రైవర్ల సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు అని పెట్టి రేవంత్‌రెడ్డి మా డ్రైవర్ల పొట్ట కొట్టాడని, సరైన కిరాయిలు, ఆటో కిస్తీలు కట్టలేక ఇబ్బంది అవుతున్నదన్నారు. గిరాకీలు లేక కుటుంబ గడవక అనేక మంది డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని పేర్కొన్నారు. ఇక్కడ జినక సైదులు, అంగోత్ బాలాజీ, రామ్మూర్తి, రవి ఉన్నారు.
పర్యటన విజయవంతం
ఎమ్మెల్సీ కవిత మానుకోట జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఉదయం 10గంటలకు దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చేరుకున్న ఆమె దివ్యాంగుడైన సతీశ్ ‘కేసీఆర్ ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్’ను ప్రారంభించారు. అకడినుంచి మరిపెడ మండలం చిల్లంచర్లంలో జాగృతి నాయకురాలు మాధవి ఇంటికి వెళ్లి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అకడినుంచి జిల్లాకేంద్రానికి చేరుకున్న కవితకు పూలే విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం అదే జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అకడినుంచి కేసముద్రం మండలం అన్నారం గ్రామానికి వెళ్లి గాయకుడు మానుకోట ప్రసాద్ ఇంటికి వెళ్లారు. అకడి నుంచి కేసముద్రం మారెట్ యార్డ్‌కు వెళ్లి అకడ మిర్చి రైతులతో మాట్లాడారు. పంటకయ్యే పెట్టుబడి, దిగుబడి ఎంత తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తకళ్లపల్లి రవీందర్రావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందు, బీఆర్ఎస్ నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.
ఉప్పొంగిన అభిమానం
మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 24 : ఎమ్మెల్సీ కవితకు జనం నీరాజనం పట్టారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెకు అడుగడుగునా అభిమానులు ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలు మంగళహారతులు పట్టి ఆశీర్వదించారు. బీఆర్ఎస్ నాయకులు పూలతో సాదరంగా ఆహ్వానించగా జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి మార్కెట్ యార్డు వరకు ప్రజలు రోడ్డుపై స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. దారి వెంబడి అనేక మంది మహిళలు, ప్రజలు తాగునీరు, సాగునీరు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కేసీఆర్ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య రాలేదని చెప్పుకొన్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కవితను కోరారు.
ఉద్యమకారులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం
దంతాలపల్లి, ఫిబ్రవరి 24 : తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్న ఉద్యమకారుల కుటుంబాలకు ఎంతచేసినా తక్కువేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు చిర్ర లింగన్న కుమారుడు, దివ్యాంగుడు సతీశ్ సోషల్ మీడియాలో తనకు ఉపాధి కల్పించాలని కోరడంతో స్పందించిన కవిత వెంటనే అతడికి ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ కోసం కంప్యూటర్, జిరాక్స్ మిషన్, ప్రింటర్‌ను సమకూర్చి సోమవారం ఆమే స్వయంగా ప్రారంభించారు. కాగా తొలిసారి మండలానికి వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పూల వర్షం కురిపిస్తూ మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ కోసం 2001లో కేసీఆర్ గులాబీ జెండా ఎగురవేసిన నాటి నుంచి నేటివరకు ఆయనతో ఉద్యమంలో పాల్గొని రాష్ట్రం తీసుకరావడంలో అందరి పాత్ర ఉన్నదన్నారు. స్ఫూర్తిప్రదాతగా, మార్గదర్శిగా కేసీఆర్ ముందుకు నడిపిస్తే వెనుక నడిచిన ఉద్యమకారుల వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. మన నీళ్లు, నిధులు మనకు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ చిన్న కుటుంబం కాదని పెద్ద కుటుంబమని మన కార్యకర్త కుటుంబానికి ఆపదొస్తే తలా ఒక చేయి వేస్తే అందరం బాగుపడే అవకాశం ఉంటుందనే ఇక్కడకి వచ్చినట్లు కవిత చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలోని దివ్యాంగులు, వృద్ధులు తమకు ఉపాధి కల్పించాలని వినతిపత్రాలు అందించారు. ఇక్కడ జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వొలాద్రి ఉమా మల్లారెడ్డి, యువ నాయకుడు రవిచంద్ర, మండల అధ్యక్షుడు ధర్మారపు వేణు, నాయకులు కిశోర్‌కుమార్, వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాములు, లింగన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
చెప్పలేనంత ఆనందంగా ఉంది..
దంతాలపల్లి, ఫిబ్రవరి 24 : ఉపాధి చూడాలని అడిగిన వెంటనే స్పందించి వరమిచ్చిన నాయకురాలే నా కోసం ఇంటికి చెప్పలేనంత ఆనందంగా ఉంది. మా కుటుంబం మొదటినుంచీ కేసీఆర్ సార్ అభిమానులం. ఉద్యమం నుంచి కేసీఆర్‌తోనే నడుస్తున్నం. కేసీఆర్ అభిమాని కండ్లల్లో ఆనందం చూసేందుకు కవితక్క ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ కోసం కంప్యూటర్, ప్రింటర్, జిరాక్స్ మిషన్ ఇవ్వడం, ఆమే వచ్చి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం కేసీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటది.
– దివ్యాంగుడు చిర్ర సతీశ్, రామానుజపురం