నయీంనగర్, ఫిబ్రవరి 6 : ఉద్యమాలకు, పోరాటాలకు వరంగల్ పెట్టింది పేరు అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలుచేసేలా బీసీ మేధావులు గళమెత్తాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కులగణన చేపట్టి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రకారం ఆరు నెలల్లో కులగణన చేపట్టే ప్రక్రియను ప్రారంభించాలని ఆమె స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ వడ్డెపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో బీసీ హకుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
బీహార్‌లో కులగణన చేసినా కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా ముందడుగు వేయలేదని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.20వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, 2024-25 బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. అలాగే బీసీ సబ్‌ప్లాన్‌కి చట్టబద్ధత కల్పించాలని, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జిల్లాగా నామకరణం చేయాలన్నారు. అలాగే అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్11లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని గుర్తుచేశారు. కానీ కేంద్రం మాత్రం సుప్రీం తీర్పును చూపి రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించడం లేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటివరకు 4365మంది సివిల్స్‌కు ఎంపికైతే అందులో కేవలం 1,195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని లేవనెత్తారు. ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని చెప్పారు. ఎస్సీలు 5శాతం, ఎస్టీలు 3శాతం మాత్రమే ఎంపికయ్యారని వివరించారు.
హకుల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యమాలకు పెట్టింది పేరైన వరంగల్ తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో ఉందని గుర్తుచేశారు. భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి బతుకమ్మకు రాష్ట్ర హోదా, నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేదర్ విగ్రహం సాధించామని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 20వేల మంది యువతకు ఉద్యోగ కల్పనకు దారి చూపామని, దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చకు ప్రేరేపించామని కవిత వివరించారు. సమావేశంలో జాగృతి ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్భాసర్, కార్పొరేటర్ చెన్నం మధు, పులి రజనీకాంత్, బక్క నాగరాజు, మాధవి పాల్గొన్నారు.
ప్రతి బీసీ ఇంట్లో జ్యోతిరావు ఫూలే ఫొటో ఉండాలి. బీసీలకు చట్టసభల్లో రావాల్సినవి చాలా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు బీసీలను చిన్నచూపు చూసేవారు. కానీ కేసీఆర్ ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పటి నుంచే ఏ కులానికీ అన్యాయం జరగొద్దని ఆలోచించి అన్ని కులాలకు సమన్యాయం చేశారు. బీసీల అభివృద్ధికి నిరంతరం కృషిచేశారు. బీసీల హక్కుల కోసం ఎమ్మెల్సీ కవిత ముందుకు రావడం చాలా సంతోషం.
సమాజానికి బీసీలు వెన్నెముక లాంటివారు. అలాంటి బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతోంది. 55శాతం బీసీలు ఉన్నా గణన చేయకపోవడం సరైనది కాదు. ఈ నెల 12న మహాధర్నా నిర్వహించబోతున్నాం. పార్టీలకతీతంగా అందరూ హాజరై విజయవంతం చేయాలి. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనివ్వం. కాంగ్రెస్ హామీలను వెంటనే నెరవేర్చాలి.
రిజర్వేషన్లు అమలు చేయాలని అంబేద్కర్ రాజ్యాంగంలో ఆనాడే రాశారు. 1929-30లోనే కులగణన చేయాలని జ్యోతిరావు, ఫూలే పోరాడారు. 1931లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ చేయడంతో బీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది. చాలా శాఖల్లో ఓబీసీలకు అన్యాయం జరిగింది.
ప్రతి ఒక్కరు భవిష్యత్ కోసం బీసీల కులగణన కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలి. ఒకే మాట.. ఒకే బాటగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే లక్ష్యం సాధిస్తాం. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో బీసీలు ఎంతో లబ్ధిపొందారు. బీసీలపై ప్రత్యేక శ్రద్ధతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయాలి.
మహాత్మా జ్యోతిరావుఫూలే బీసీల్లో పుట్టి, ఆనాడు ఉన్న పరిస్థితుల ప్రకాకరంబ్రాహ్మణులు, దళితుల కోసం కొట్లాడారు. లక్ష్యం కోసం పనిచేసే వాళ్లకు కులం అంటూ ఏమీ ఉండదు. చాలామంది మహనీయులు కూడా అదే పనిచేశారు. బీసీల కోసం చేసే ఉద్యమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొనాలి. కేసీఆర్ దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు ఏర్పాటు చేశారు. ఆశయాల కోసం వందలాది మంది మరణించిన గడ్డ తెలంగాణ గడ్డ. అణచివేయబడ్డ వారికి గుర్తింపు ఉండాలి. అన్ని వర్గాలను కలుపుకొని బీసీల కులగణన సాధించుకోవాలి.