గట్టుప్పల్, జూన్ 29 : ఇందిరమ్మ ఇల్లులు రాని అర్హులైన నిరుపేదలకు రెండవ జాబితాలో ఇల్లు ఇప్పించే బాధ్యత నాదేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు హామీలు ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడానికి ఉదయాన్నే మునుగోడు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామంలో అన్ని వీధులలో పర్యటించారు. ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లులు రాని అర్హులైన నిరుపేదలకు రెండవ జాబితాలో ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.
గుడిసెలో జీవిస్తున్న రాములు ఇంటికి వెళ్లి పరిశీలించారు. రాములుకు ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. ప్రభుత్వం తరఫున ఇచ్చే ఐదు లక్షలతో పాటు ఇల్లు పూర్తి అవ్వడానికి మిగిలిన ఆర్థిక సాయం చేసి ఇంటిని నిలబెడతానని అన్నారు. కరెంటు లూజు లైన్స్, గృహాల మీదుగా వెళ్తున్న 11 కేవి కరెంటు లైన్ లను వెంటనే తొలగించాలని విద్యుత్ అధికారులకు ఆదేశించారు. అంతంపేట నుండి దేవు లతండా, రాజ్యతండా కు కొత్తగా నిర్మిస్తున్న రోడ్డును పరిశీలించారు.
అంతంపేట నుండి నామాపురం గ్రామానికి వెళ్లే రోడ్డును పరిశీలించారు. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో రాజకీయాలకు పార్టీలకు తావు లేదన్నారు. జనంలో ఏ సమస్య ఉన్న పరిష్కరించే బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంటుందని, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేసే వాళ్లే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా పోటీ చేయాలని, ప్రజలు కూడా అటువంటి వాళ్లని గెలిపించుకోవాలని సూచించారు.