హోటల్లో రెస్టారెంట్ ఉంటుంది. జిమ్, స్విమ్మింగ్‌పూల్, స్పా ఇవన్నీ అదనపు హంగులు. కండలు పెంచుకోవడానికి జిమ్. ఆ కండబలం కాపాడే ప్రొటీన్ రిచ్ ఫుడ్ కావాల్సినంత వడ్డిస్తారు. కండబలం సరే! మరి బుద్ధిబలం సంగతి? అందుకే అతిథుల జ్ఞానజిజ్ఞాస పెంచే పుస్తకాలతో లైబ్రరీ కూడా ఉండాలని కొన్ని హోటళ్లు గ్రంథాలయాలనూ నిర్వహిస్తున్నాయి. కొత్త ప్రదేశంలో గడిపినప్పుడు మనసుకు ఓ తోడు కావాలి. కాలక్షేపానికి అందరికంటే గొప్ప స్నేహితుడైన పుస్తకానికి మించిన తోడు ఇంకెవరుంటారు? పుస్తకాలతో స్నేహం చేస్తూ పోయినపని చక్కబెట్టుకోవచ్చు. ఎప్పుడైనా అవకాశం వస్తే ఈ హోటళ్లలో ఆతిథ్యం స్వీకరించండి.
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు స్థానిక చరిత్ర, సంస్కృతి, విశేషాలు తెలియజేసేందుకు ఈ హోటల్ లైబ్రరీల్లో తప్పకుండా ఒక విభాగం ఉంటుంది. ఆ పుస్తకాల చెంతనే ఆ దేశ పర్యాటక విశేషాలు తెలియజేసే అనేక పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసం, బిజినెస్ పుస్తకాలు కూడా ఉంటాయి. హోటళ్లకు వచ్చేవాళ్లలో పర్యాటకులు, వ్యాపారులే ఎక్కువగా ఉంటారు. వాళ్ల ఆసక్తి, అవసరాలకు తగ్గట్టుగా అల్మరాల్లో పుస్తకాలను సిద్ధంగా ఉంచుతున్నారు.
హకోన్ హూంబాకో (కనగావా, జపాన్)

Hakone Honbako Japan
చాలా హోటళ్లు రద్దీగా, ఇరుకుగా ఉంటాయి. చుట్టూ కాంక్రీట్ భవనాల మధ్య వాయు కాలుష్యంలో కొట్టుమిట్టాడుతుంటాయి. వాటికి భిన్నంగా పచ్చని ప్రకృతి మధ్య విశాలమైన రీడింగ్ హాల్, వేల పుస్తకాలతో ప్రశాంతతను కల్పించే హోటల్ ఇది. ఇలాంటి వాతావరణంలో హాయిగా సేదతీరుతూ ఆనందంగా చదువుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
హోటల్ నాట్ హోటల్ (ఆమ్స్టర్డామ్, జర్మనీ)

Hotel Not Hotel
పేరు భలేగా ఉంది కదా. నిజమే మరి. హోటల్ లాంటి మ్యూజియం ఇది! ప్రతి గదిలో ఏదో ఒక కళాఖండం ఉంటుంది. మరెక్కడా లేని అందమైన ఇంటీరియర్‌తో అలంకరించిన ఈ హోటల్ లాబీలో పెద్ద లైబ్రరీ ఉంది. పుస్తక ప్రేమికుల్లో మిస్టరీ స్టోరీలు ఇష్టపడేవాళ్లుంటారు. అలాంటి వాళ్లకు కావాల్సినన్ని మిస్టరీ బుక్స్ ఇందులో ఉన్నాయి.
లా రిజర్వ్ (పారిస్, ఫ్రాన్స్)

La Reserve
పదిహేడో శతాబ్దం నాటి మాన్షన్‌ని ఆధునీకరించిన తర్వాత ఇందులో హోటల్ నిర్వహిస్తున్నారు. పాలరాతి అందం, ఓక్ చెక్కతో తీర్చిదిద్దిన గోడలు, సిల్క్ తెరలు వేలాడే ద్వారాలు, కళాఖండాల వంటి కుర్చీలు, టేబుళ్లు వాటి చుట్టూ పుస్తకాలతో అద్భుతంగా ఉంది ఈ గ్రంథాలయం. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ హోటల్లో ఆథిత్యం కొత్త అనుభూతినిస్తుంది. ఇక్కడికి వచ్చే అథితుల కోసం లాంజ్‌లో
30 వేల పుస్తకాలతో లైబ్రరీ నిర్వహిస్తున్నారు. ఇక్కడే తినొచ్చు, ఇక్కడే కూర్చుని పుస్తకాలు చదువుకోవచ్చు.
హోటల్ ఎమ్మా, (టెక్సాస్, అమెరికా)

Hotel Emma san Antonio
కోటలాంటి హోటల్ ఇది. పంతొమ్మిదో శతాబ్దంలో ఈ భవనం నిర్మించారు. ఇందులో సుమారు నూట యాభై గదులు ఉన్నాయి. రాజసం ఉట్టిపడే ఈ హోటల్ మధుప్రియులకే కాదు పుస్తక ప్రియులకూ ప్రియమైనదే. ఒకప్పుడు బ్రూవరీగా మధువుని అందించిన ఈ భవనం ఇప్పుడు పుస్తకాలయంగా ఆతిథ్యం ఇస్తున్నది. మద్యం తయారీలో ముడి పదార్థాలను పులియబెట్టిన రెండు సెల్లార్లను గ్రంథాలయంగా తీర్చిదిద్దారు. ఆనాటి డిస్టిలరీ యంత్రం ఇప్పటికీ అక్కడే ఉండి ఆకట్టుకుంటున్నది! ఈ గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతూ ఉండే పాఠకులు ఆర్డర్ ఇస్తే.. కావాల్సిన ఫల రసాలను సర్వర్లు
సరఫరా చేస్తుంటారు.
హత్మాన్ హోటల్ (పోర్ట్‌ల్యాండ్, అమెరికా)

Heathman
ఈ హోటల్ 21వ శతాబ్దంలో ప్రారంభమైనదే! అయినా పాతకాలపు సినిమా థియేటర్లా కనిపిస్తుంది. ఇదో ప్రత్యేకమైన హోటల్ లైబ్రరీ. నచ్చిన రచయితని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కోరుకునే అభిరుచి ఉన్న పాఠకులకు హత్మాన్ హోటల్ లైబ్రరీ భలే ఆనందం కలిగిస్తుంది. ఈ లైబ్రరీలో వివిధ రచయితలు తమ స్వీయ రచనలపై ఆటోగ్రాఫ్ చేసిన పుస్తకాలు మూడు వేల వరకు ఉన్నాయి. ఆయా రచయితలను కలవలేకున్నా వారి సంతకాన్ని చూసి, స్పర్శతో అనుభూతి చెందే ఓ సదావకాశం కల్పిస్తున్నారు.
లైబ్రరీ హోటల్(న్యూయార్క్, అమెరికా)

Library Hotel New York City
ప్రపంచ దేశాలకు అనధికారిక రాజధాని అనుకునే న్యూయార్క్ అంతర్జాతీయ కార్యాలయాలకే కాదు ప్రసిద్ధమైన గ్రంథాలయాలకూ పేరుగాంచినది. పుస్తక ప్రేమికులను ఆకర్షించే న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ, గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ఉన్న ఈ నగరంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఈ లైబ్రరీ హోటల్. కాకపోతే ఈ గ్రంథాలయంలోకి ఒక పాఠకుడిగా వస్తానంటే కుదరదు. అతిథిగా అడుగుపెడితేనే పాఠకుడిగా గుర్తింపు వస్తుంది. హోటల్ నడిపే లైబ్రరీ కదా! ఈ హోటల్లోని ప్రతి అంతస్తులోనూ ఎన్నెన్నో అరల్లో డెసిమల్ పద్ధతిలో పుస్తకాలను పేర్చారు. ఆరువేల పుస్తకాలున్నాయి. ఇరవై నాలుగు గంటలూ రీడింగ్ రూమ్ తెరిచే ఉంటుంది. పుస్తకాలే కాదు రూఫ్‌టాప్ బార్లోకీ ఇరవై నాలుగు గంటలూ అనుమతిస్తారు. సిటీ వ్యూతో ఉండే ఈ హోటల్ ఆథిత్యం ఓ ప్రత్యేకం! మధువు కావాలా? పుస్తకం కావాలా? అన్నది అతిథి ఇష్టం. కోరిన ఆతిథ్యం ఇస్తారన్నమాట.
లాస్కర్ హోటల్ (లండన్, ఇంగ్లండ్)

The L’oscar Hotel
చర్చి అనగానే గోతిక్ శైలి గుర్తుకువచ్చినట్టే, అద్బుతమైన ఇంటీరియర్ కూడా గుర్తుకు వస్తుంది. రూఫ్‌కి వేలాడే దీపాల కాంతిలో అందంగా వెలిగిపోతున్న ప్లాస్టర్ వర్క్, ఖరీదైన ఇంటీరియర్స్ ఉన్న ఈ చర్చ్‌లో ఇప్పుడు ప్రార్థనలకు బదులు పుస్తక పఠనం నడుస్తున్నది. రెస్టారెంట్‌గా మారిన ఒకప్పటి చర్చ్ అందాలను చెరపడం ఇష్టం లేక, రెస్టారెంట్‌తోపాటు గ్రంథాలయాన్నీ కలిపి నడుపుతున్నారు. ఆకలి తీరిన తర్వాత జ్ఞాన తృష్ణ తీర్చుకోవడానికి ఇదో మంచి ఏర్పాటు.
బీ2 హోటల్ (జ్యూరిచ్, స్విట్జర్లాండ్)

Heathman1
ప్రపంచ పర్యాటకంలో స్విట్జర్లాండ్ తర్వాతే మరే దేశమైనా. అంతేకాదు అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు ఆ దేశం ఎంతో ప్రసిద్ధి. ప్రపంచ నాయకత్వానికి ప్రతి ఏటా ఆతిథ్యం ఇచ్చే ఈ దేశంలో ఏడాది పొడవునా పర్యాటకుల సందడి ఉంటూనే ఉంటుంది. శీతాకాలంలో మంచు అందాలు, వేసవిలో ప్రకృతి సోయగాలు చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం హోటళ్లెన్నో ఉన్నాయి. విలాసవంతమైన హోటళ్లకు పేరుగాంచిన స్విట్జర్లాండ్‌లోని బీ2 హోటల్‌కు 130 ఏళ్ల చరిత్ర ఉంది. పర్యాటకుల్లో పఠనాసక్తిని పెంచడానికి, పఠనాభిలాష ఉన్న యాత్రికులను ఎంగేజ్ చేయడానికి 30 వేల పుస్తకాలతో ఇందులో ఓ గ్రంథాలయం ఉంది. ఎత్తయిన అరల్లో ప్రసిద్ధ రచయితల రచనలెన్నో ఇక్కడ పొందుపరిచారు. అథితుల ఎత్తుకు తగ్గట్టుగా అనేక రకాల కుర్చీలు ఇక్కడి రీడింగ్ హాల్లో ఉన్నాయి. ఎవరికి సౌకర్యంగా ఉండే కుర్చీలో వాళ్లు కూర్చుని చక్కగా నచ్చిన పస్తకం చదువుకోవచ్చు.
లిటరరీ మ్యాన్ ఒబిడోస్ హోటల్ (ఒబిడోస్, పోర్చుగల్)

Literary Man Hotel
ఇది పేరుకు తగ్గ హోటల్. పంతొమ్మిదో శతాబ్దం నాటి ఒబిడోస్ క్యాజిల్ (కోట)ని హోటల్‌గా మార్చారు. ఈ హోటల్లోని ప్రతి మూలలో బుక్ ర్యాక్ ఉంటుంది. పుస్తకాల అమరిక అనండి, లేదా అలంకరణ అనుకోండి.. చిన్న ప్రదేశాన్ని కూడా వదలకుండా పుస్తకాలతో హోటల్ని నింపేశారు. ఇందులోని రెస్టారెంట్లో పలువురు రచయితల స్ఫూర్తితో కొన్ని వంటకాలు, పుస్తకాలతో సరదా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.