ఖానాపురం, జూలై 12: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చంద్రబాబునాయుడి ప్రతినిధి అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం ఆయన వేపచెట్టుతండాలో 365 జాతీయ రహదారిపై రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులను అభివృద్ధి చేస్తామని వరంగల్‌లో జరిగిన సభలో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని గుర్తుచేశారు. వరంగల్ డిక్లరేషన్ అంటే రైతులకు 3 గంటల కరంటు ఇవ్వడమేనా అని ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటల కరంటు అవసరం లేదని రేవంత్‌రెడ్డి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎందరో త్యాగాల ఫలతమే నేడు 24 గంటల కరంటు అన్నారు. ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో కరంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో నానా అవస్థలు పడేవారన్నారు.
చంద్రబాబు హయాంలో కరంటు సమస్యలపై వైఎస్సార్ పోరాటం చేస్తే బషీర్‌బాగ్‌లో ఎంతోమందిని కాల్చి చంపించారని, ఆ చరిత్ర మరిచిపోలేదన్నారు. అప్పుడు బాబు వంచన చేరిన రేవంత్‌రెడ్డి రైతులపై చంద్రబాబు ఫాసిస్టు విధనాలనే అవలంబిస్తున్నాడని విమర్శించారు. రూ. 200 ఉన్న పింఛన్‌ను సీఎం కేసీఆర్ పది రెట్లు పెంచారన్నారు. రాబోయే 4 నెలలు కాంగ్రెస్ పార్టీతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను ప్రజలే తీసుకోవాలని కోరారు. లేకపోతే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు బాలకిషన్, భూక్యా పద్మావతి, వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.